రైతులకు సన్నధాన్యం కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వరి కోతలు ముమ్మరం అవుతున్న తరుణంలో పోలీసులు, రెవెన్యూశాఖ, వ్యవసాయశాఖల సమన్యయంతో ధాన్యం కోత, అమ్మడం కోసం టోకెన్లను విడుతల వారీగా ఇస్తున్నారు. వాటికోసం నల్గొండ త్రిపురారం మండల కేంద్రంలో ఉన్న వ్యవసాయ కార్యాలయం ఎదుట రైతులు బారులు తీరారు. ఉదయం 4 గంటల నుంచి లైన్లో వేచి ఉన్నామని, 50 టోకెన్లు మాత్రమే ఇస్తున్నారని అన్నదాతలు వాపోయారు.
దాదాపు 300 మంది రైతులు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సమయానికి రావడం లేదని, వరి కోత యంత్రాలు దొరక్క ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉండాల్సిన తాము ఉదయమే మండలానికి రావాలి అంటే ఇబ్బందిగా ఉందని విచారం వ్యక్తం చేస్తున్నారు.
"సీఎం కేసీఆర్ సూచనతో సన్నరకాలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయాం. టోకెన్లు ఇచ్చినా ట్రాక్టర్లో ధాన్యం తీసుకొని పోయి మిల్లులో తిండి తిప్పలు లేకుండా మూడు నాలుగు రోజులు ఇబ్బందులు పడుతున్నాం. వాన పడితే పట్టాలు లేక ధాన్యం తడిస్తే... తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు అడుగుతున్నారు. కోతకు టోకెన్లు పెట్టడం వల్ల యంత్రాలు సమయానికి వస్తలేవు. ఇతర రాష్ట్రాల యంత్రాలు ఇక్కడకు రావడానికి అనుమతిస్తారు కానీ కోతకు అనుమతి లేదంటారు. అధికారులు సమయానికి రాకపోవడం వల్ల చిన్నలు, పెద్దలు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి."