నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తహసీల్దార్ కార్యాలయం ముందు ధాన్యం టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. టోకెన్ ఉంటే రైతులు ధాన్యం కొనుగోలు చేస్తున్నందున... రైతులు తహసీల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. రద్దీ ఎక్కువ కావడం వల్ల తోపులాట జరిగి, మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజులకు సరిపడా టోకెన్లు ముందే జారీ చేశామని చెబుతున్నారని... వారు ఇచ్చిన టోకెన్లో ఏ తేదీ ఉంటే ఆ రోజే వరి కోయాలని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14న టోకెన్ పొందేందుకు ఈరోజు లైన్లో నిలబడ్డవారికి చీటి ఇస్తున్నారని... మళ్లీ ఆ రోజు వచ్చి ఇదే విధంగా నిలబడాలని వాపోయారు.
వేచి చూస్తే ప్రమాదమే..
ఇన్ని రోజులు కాలయాపన చేస్తే తమ పంట పొలంలోనే తూరిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని రైతులకు తహసీల్దార్ కార్యాలయంలోనే టోకెన్లు ఇవ్వనున్నందున... దూరప్రాంతాల వారి తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సివస్తోందన్నారు. మహిళా రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. గ్రామాల వారీగా పంచుతామన్న అధికారులు అందరికీ ఒకే చోట ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆవేదన చెందుతున్నారు.