రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకోవటంలో ఇబ్బందులు మాత్రం తప్పటంలేదు. తెగుళ్లను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని.... తీరా విక్రయించే సమయంలో ఆశలు ఆవిరవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గతంలో సన్న రకాల సాగు తక్కువగా ఉన్నందున... డిమాండ్ కూడా తక్కువగా ఉండేది. ప్రభుత్వం నియంత్రిత పంటల సాగు విధానంతో సన్నరకాలను రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. ఈ పరిస్థితుల్లో దొడ్డు రకాలతో పోల్చితే.. సన్నాలకు మార్కెట్లో డిమాండ్ తగ్గే పరిస్థితి నెలకొంది. క్వింటాల్ సన్నరకానికి గతంలో 2 వేల నుంచి 22వందల వరకు ధరలు పలికేది. కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా.... 2 వేలకు పైగా చెల్లించి నేరుగా మిల్లర్లే ఖరీదు చేసేవారు. కానీ ఈ సీజన్లో పెరిగిన సాగుతో... ధర మాత్రం బాగా తగ్గిపోయింది. దొడ్డురకంలో 'ఏ' గ్రేడ్ రకానికి 1,888 రూపాయలు... సాధారణ రకానికి 1,868 మద్దతు ధర చెల్లించాలని ఉంది. అయినా దొడ్డు రకానికున్న మద్దతు ధరనే... సన్నాలకు చెల్లించాలని చెప్పడం వల్ల సాగుదారులు నోరెళ్లబెడుతున్నారు.
రైతుల పరిస్థితి దయనీయం
సన్నాలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలిచ్చినా... దానికి ప్రత్యేక మద్దతు ధర అంటూ ఏమీ నిర్ణయించలేదు. వాటిని కొనుగోలు చేయాలని కూడా... ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు జారీకాలేదు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బియ్యపు మిల్లులకు నిలయమైన మిర్యాలగూడలో... వంద పెద్ద మిల్లులు, మరో 80 చిన్న మిల్లులున్నాయి. ఇక్కడి మిల్లుల్లో నిత్యం 13 వందల ట్రాక్టర్ల వరకు కొంటుంటారు. కానీ, ప్రస్తుతం పెరిగిన సాగుతో... రోజుకు 2 నుంచి 3 వేల వరకు ట్రాక్టర్లు వస్తుండగా... మిల్లర్లు పేచీ పెడుతున్నారు. భారీస్థాయిలో కొనలేమని.. తక్కువ ధరకు ఇస్తే ఆలోచిస్తామని తెల్చిచెబుతున్నారు. ఈ పరిస్థితిల్లో శుక్రవారం రాత్రి అద్దంకి-నార్కట్ పల్లి రహదారిపై శెట్టిపాలెం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గతానికి భిన్నంగా క్వింటాల్‌కు నాలుగైదు వందలు తగ్గుతుండటం పట్ల... సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.