తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన.. - రైతుల ధర్నా లేటెస్ట్​ వార్తలు

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆగమవుతున్నాడు. పండించిన పంటను అమ్ముకోవడానికి నానా అవస్థలు పడుతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్మడానికి తీసుకొస్తే పోలీసులు అడ్డుకోవటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆలగడప మూసీ నది బ్రిడ్జి మీదుగా రైతులు తీసుకొస్తున్న ధాన్యం ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేయటం వల్ల చిల్లేపల్లి వద్ద అన్నదాతలు ధర్నాకు దిగారు. దీంతో మిర్యాలగూడ, కోదాడ రహదారిపై భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది.

farmers protest at alagadapa in nalgonda district
ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన..

By

Published : Nov 8, 2020, 4:59 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మిల్లుల వద్ద వందల సంఖ్యలో ధాన్యపు టాక్టర్లు ఉండగా ఈ రద్దీని నివారించడానికి ఇతర జిల్లాల నుంచి వస్తున్న ధాన్యం ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆలగడప మూసీ నది బ్రిడ్జి మీదుగా రైతులు తీసుకొస్తున్న ధాన్యం ట్రాక్టర్లను పోలీసులు నిలిపివేయటం వల్ల చిల్లేపల్లి వద్ద అన్నదాతలు ధర్నాకు దిగారు. దీంతో మిర్యాలగూడ, కోదాడ రహదారిపై భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. పై అధికారుల ఆదేశాల మేరకు నిలిపివేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

శనివారం రాత్రి ఆరు గంటల నుంచి రహదారిపై ట్రాక్టర్లు నిలిపివేయడం వల్ల మిర్యాలగూడ-కోదాడ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లమీద ధాన్యం ట్రాక్టర్లతో పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామని వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని వాపోయారు. రోడ్లపై రెండు రోజులు, టోకెన్ తీసుకోవడానికి మరో రెండు రోజులు, మిల్లువద్ద రెండుమూడు రోజులు ఇలా వేచి ఉండే సరికి ట్రాక్టర్లలోని ధాన్యం నల్లగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.

మద్దతు ధర దేవుడెరుగు పెట్టిన పెట్టుబడి వస్తుందేమోనని పంటను అమ్ముకోవడానికి వెళ్తుంటే అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. తిండి తిప్పలు లేకుండా రోడ్లపైనే రైతులు కాలం వెళ్లదీస్తున్నా.. ఏ ఒక్క రాజకీయ నాయకుడు తమను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇక్కడ నుంచి పంపిస్తే మిర్యాలగూడ మార్కెట్ యార్డ్​లో ధాన్యాన్ని ఆర బెట్టుకుంటామని చెబుతున్నారు. కొంతమంది రైతులు రోజుల తరబడి ట్రాక్టర్లతో వేచి ఉండి.. విసిగివేసారి రూ.1100 లకు అమ్ముకున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:పత్తి రైతులకు షాక్.. మద్దతు ధర రూ.50 తగ్గింపు..

ABOUT THE AUTHOR

...view details