సన్నధాన్యాన్ని అమ్ముకునేందుకు సాగుదారులు.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇచ్చే అరకొర టోకెన్ల కోసం.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. దీంతో మండల కార్యాలయాల వద్ద.. జన సందోహం నెలకొంటోంది. అయితే జారీ ప్రక్రియలో సరైన తీరును అనుసరించకపోవడం వల్ల రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. టోకెన్లు అందజేసేందుకు గాను ముందుగా రశీదులు ఇస్తున్నారు. ఆ రశీదుల్లో ఉన్న తేదీ ప్రకారం వస్తే.. టోకెన్లు అందజేస్తున్నారు. కానీ నాలుగు వందల మంది పేర్లు నమోదు చేయించుకుంటే.. అందులో వంద మందికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారు. దీనిపై కర్షకుల్లో తీవ్ర ఆవేదన కనిపిస్తోంది.
వేములపల్లి ఎంపీడీవో కార్యాలయంలో.. టోకెన్ల కోసం ఉదయం నుంచే బారులు తీరారు. తిండీతిప్పలు మాని.. వాటి కోసమే గంటల పాటు వరుసలో ఉంటున్నారు. అయినా టోకెన్లు దక్కక.. నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్లోనూ అదే తీరు కనిపించింది. శుక్రవారం కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు.. రెండు వందల మందికి పైగా వచ్చారు. అయితే వారికి రశీదులు ఇచ్చే విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఇస్తారనే ఆశతోనే ఆరు గంటలపాటు నిరీక్షించారు. ఈటీవీ-ఈనాడు ద్వారా విషయం తెలుసుకున్న ఆర్డీవో రోహిత్ సింగ్.. అప్పటికప్పుడు అందరికీ రశీదులు ఇచ్చేలా చేశారు. అయితే టోకెన్ల కోసం జరుగుతున్న తంతుపై.. కర్షకుల్లో తీవ్ర ఆవేదనతోపాటు ఆగ్రహం కనిపిస్తోంది.