నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామ పరిధిలో మూసీ కాలువ ఆయకట్టు పూర్తిస్థాయిలో సాగుకు నోచుకోవడం లేదు. కొందరు రైతులు తమ రాజకీయ, ఆర్థిక పలుకుబడితో కాలువ భూములను కబ్జా(musi project canal land occupation) చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులకు సాగునీటి తిప్పలు తప్పడం లేదు. ఆక్రమణల కారణంగా వర్షాకాలంలో ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే సాగునీరు సజావుగా దిగువకు రావడం లేదు. ఆక్రమిత ప్రాంతంలో మూసీ జలాలు నిలిచిపోయి... ఆ ప్రాంతంలోని పత్తి, ఇతర మెట్ట పంటలు నాశనమవుతున్నాయి.
కబ్జా కోరల్లో కాలువ
కాలువ కబ్జాకు గురై... తాము పడుతున్న ఇబ్బందులను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు వాపోతున్నారు. మూసీ కాలువ కొప్పోలు నుంచి దిగువన ఉన్న ఆమనగల్లు, రావులపెంట గ్రామాల పరిధిలో తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ మూడు వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా అధికారులు డిజైన్ చేశారు. ఆమనగల్లు చెరువు నిండి అలుగుపోసే సమయంలో వచ్చే వరదను సైతం ఈ కాలువకు అనుసంధానం చేశారు. దీంతో అధిక వర్షాలు కురిసిన సందర్భాల్లోనూ వచ్చే వరద నీరు సైతం ఈ కాలువ గుండా ప్రవహించి రావులపెంట చెరువులోకి చేరుతుంది. ఈ కాలువను కొందరు కబ్జా(musi project canal land occupation) చేసి సాగుకు అనుకూలంగా మలుచుకున్నారు. ఫలితంగా కాలువ విస్తీర్ణం తగ్గిపోయింది. కొన్నిచోట్ల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. వాస్తవంగా కాలువ విస్తీర్ణం 66 ఫీట్లు ఉండేదని స్థానికులు, అధికారులు చెబుతున్నారు.అయితే భీమవరం, సూర్యాపేట రోడ్డు కల్వర్టు నుంచి అర కిలోమీటర్ పొడవునా కాలువ ఆక్రమణకు గురైంది.
ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు
కాలువ కబ్జాతో రాకపోకలు, యంత్రాలతో పంట నూర్పిడి చేసుకోవడం అత్యంత క్లిష్టంగా తయారైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమనగల్లు వద్ద కాలువ కబ్జా విస్తీర్ణం సుమారు ఆరు ఎకరాల వరకు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై ఎవరైనా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేస్తే... భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. సుమారు తొమ్మిది కిలోమీటర్ల పొడవున విస్తరించిన ఈ కాలువ... అర కిలోమీటరు మేర పూర్తిగా కబ్జాకు గురికావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. గతంలో పంట పొలాలకు వెళ్లేందుకు ఇరువైపులా కాలువ కట్టలు ఉండేవని... ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వెళ్లి సాగు పనులు పూర్తి చేసుకునే వాళ్లమని చెబుతున్నారు. ఇప్పుడు వాటి ఆనవాళ్లు లేకుండా చేసి... ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.