అన్నదాతల ఆదాయం పెంచడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (farmer producer organization) ఎంతో కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా పెట్టుబడుల కోసం తక్కువ వడ్డీకి రుణాలు అందించడం, నాణ్యమైన విత్తనాల పంపిణీ, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ఈ సంఘాలు కృషి చేస్తూ మన్ననలు పొందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ(central government support) ప్రోత్సాహంతో ఏర్పాటై రాష్ట్ర సర్కార్(Telangana government) చొరవతో రాష్ట్రంలో పలు సంఘాలు రాణిస్తున్నాయి.
సహకార సంఘాలకు భిన్నంగా..
ఎఫ్‌పీఓల(fpo) కార్యకలాపాలు సహకార సంఘాలకు భిన్నంగా సాగుతాయి. వీటిని కంపెనీల చట్టం లేదా సహకార చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఏడాదికోసారి కార్యవర్గాలను ఎన్నుకునేలా నియమావళిని రూపొందించారు. ఇందులో చేరిన ప్రతి సభ్యుడు వాటాధనం కింద రూ.1000, సభ్యత్వ రుసుం కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ప్రత్యేకంగా ఎరువుల దుకాణం
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని లింగంపల్లిలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో కామారెడ్డి జిల్లా అభ్యుదయ రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని(farmer producer organization in kamareddy district) పన్నెండేళ్ల క్రితమే ఏర్పాటు చేశారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోళ్ల కోసం సభ్యులకు రుణాలు అందిస్తోంది. పంటఉత్పత్తులు కొనుగోలు చేసి వారికి అండగా నిలుస్తోంది. సభ్యుల వాటాధనంతో ప్రత్యేకంగా ఎరువుల దుకాణం ఏర్పాటు చేశారు.
కస్టమ్స్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు..
ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలం విశ్వనాథపల్లిలో 2018లో ఏర్పాటైన సిరివెన్నెల రైతు ఉత్పత్తిదారుల సంఘంలో(sirivennela farmer producer organization) 1500 మంది సభ్యులు ఉన్నారు. రూ.25 లక్షల ప్రభుత్వ ఆర్థిక సాయంతో కస్టమ్స్ హైరింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆరు ట్రాక్టర్లు, నాలుగు కల్టివేటర్లు, ఒక రోటావేటరు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, వరి కట్టలు కట్టే పరికరాలు, తైవాన్ స్ప్రేయర్లను మార్కెట్ రేటు కంటే తక్కువకే అద్దెకు ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువుల వ్యాపారం చేస్తూ రెండేళ్లలో రూ.1.90 లక్షల ఆదాయం పొందారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన (బాహేషాన్) రైతు ఉత్పత్తిదారుల సంఘంలోనూ దీనికి భాగస్వామ్యం ఉంది. కూరగాయలు, మామిడి, జామ, పుచ్చకాయలు, బొప్పాయిలను పంపిస్తూ లాభాలు పొందుతున్నారు. గతేడాది ఇలా రూ.6 లక్షల వరకు లాభం రావడం విశేషం.