పోడు భూములను సాగుచేసుకుంటూ... జీవనం సాగిస్తున్న నల్గొండ జిల్లాలోని గిరిజనులు... పట్టాల కోసం ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఎట్టకేలకు వారి సమస్య పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని ఈనెల 10న జరిగిన హాలియా బహిరంగసభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సీఎం ఆదేశాల మేరకు...
సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీద కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్... మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎస్ సోమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుమలగిరి మండలంలో అధికార యంత్రాంగం గ్రామాల పర్యటనకు బయలుదేరింది.
నోటిఫై ప్రతులు...
తిరుమలగిరి మండలంలో ఇప్పటికే సదరు భూములను గుర్తించిన అధికారులు... నోటిఫై ప్రతుల్ని జిల్లా అదనపు కలెక్టర్ల సమక్షంలో గ్రామపంచాయతీ కార్యాలయాలకు అతికించారు. మండలంలోని నెల్లికల్, చింతలపాలెం, తునికినూతల గ్రామాల్లోనే... ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు తేల్చారు. మండలంలోని 5 గ్రామాల్లోనే గతంలో అధికంగా పట్టా పాసుపుస్తకాలు నమోదై ఉన్నాయి. ఉన్నది వంద ఎకరాలైతే 150 ఎకరాలకు పాసు పుస్తకాలుండటంతో... వాటిని పట్టాదారుల పేరిట కాకుండా వివాదాస్పదమైనవిగా పేర్కొంటూ అధికారులు 'పార్ట్-బీ'లో చేర్చారు.