తెలంగాణ

telangana

ETV Bharat / state

దూదిపూల దుఃఖం... పత్తి సాగుతో అన్నదాత ఆగమాగం - Nalgonda cotton formers problems

తెల్లబంగారం సాగుపై రైతులు పెట్టుకున్నఆశలు అడియాసలయ్యాయి. వరుసగా కురిసిన వర్షాలు... ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. భూ యజమానులు, కౌలు రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి నిండా మునిగిపోయే స్థితికి చేరుకోగా... ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులున్న సీజన్లకు భిన్నంగా, ఈసారి ఐదారు క్వింటాళ్లు దక్కడమే గగనమని అంటున్నారు.

తెల్లబంగారం రైతుల ఆశలు అడియాసలు
తెల్లబంగారం రైతుల ఆశలు అడియాసలు

By

Published : Oct 21, 2020, 5:15 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పత్తి పంటకు ఈసారి ఎక్కడా సరైన దిగుబడులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇది వాతావరణ ప్రభావమా లేక నాసిరకం విత్తనాలేనా అన్న అనుమానం రైతులకు కలుగుతోంది. ఎకరాకు కేవలం క్వింటా మాత్రమే దిగుబడి వచ్చిన రైతులు వందల్లో ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో పదిన్నర లక్షల ఎకరాల్లో తెల్లబంగారం పండించారు. అందులో విభాజ్య నల్గొండ జిల్లాలో 7 లక్షల 29 వేల 405 ఎకరాలు... సూర్యాపేట జిల్లాలో లక్షా 35 వేల 454... యాదాద్రి జిల్లాలో లక్షా 78 వేల 890 ఎకరాల్లో పత్తి సాగైంది.

వేల ఎకరాల్లో...

పత్తి పంటకు పెట్టింది పేరుగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు ఉంటాయి. దేవరకొండ నియోజకవర్గంలో 2 లక్షల 80 వేల ఎకరాల వ్యవసాయ భూమికి గాను ఈసారి 2 లక్షల 15 వేల ఎకరాల్లో పత్తి వేశారు. మునుగోడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో లక్షా 60 వేల ఎకరాల్లో సాగైంది.

పక్వానికి వచ్చే సమయంలో...

నకిరేకల్ నియోజకవర్గంలో 15 వేల ఎకరాల్లో పండించారు. 90 రోజుల్లో దిగుబడులు వచ్చే పత్తి కోసం పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఆసక్తి చూపుతుంటారు. ఎకరాకు రూ. 8 నుంచి 10 వేల వరకు చెల్లించి పంటలు వేస్తారు. ఊడ, పూత, పిందె దశ వరకు రెండు వర్షాలు పడ్డా చాలు బాగా కాత ఉంటుంది. కాయ కూడా విరగకాసి పక్వానికి వచ్చే సమయంలో ఏకధాటిగా వర్షాలు పడ్డాయి.

అంతుచిక్కని స్థితి...

జూన్- జులైలో విత్తనాలు వేస్తే అక్టోబర్​లో పంట చేతికందుతుంది. ఎక్కువ దిగుబడులు, పూర్తి నాణ్యతతో వచ్చేది అక్టోబర్​లోనే. అలాంటి అత్యవసర సమయంలోనే సీసీఐ కేంద్రాలు తెరచుకోలేకపోయాయి. అవి ఎప్పుడు ప్రారంభమవుతాయో అంతుబట్టని పరిస్థితి. నవంబరు 15 కల్లా సీసీఐ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని భావిస్తుండగా ఇపుడున్న వాతావరణం దృష్ట్యా అప్పటివరకు అసలు పత్తే ఉండకపోవచ్చు.

దళారుల ఆసరా...

కలిసిరాని కాలం తీరును ఆసరా చేసుకుంటున్న దళారులు గ్రామాలకు వెళ్లి పత్తి కొంటున్నారు. మద్దతు ధర ప్రకారం నాణ్యమైన పత్తికి గత సీజన్​లో క్వింటాకు రూ. 5,800 పలికింది. కానీ నిల్వ చేసుకునే పరిస్థితులు లేక, ఇంకా ఆగితే పత్తి పాచిపోయే దశకు చేరుకుంటుండటం వల్ల ఎంతకైతే అంతకు అమ్మే యోచనలో ఉన్నారు. దళారులు క్వింటాకు రూ. 3,500 నుంచి రూ. 4 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు.

ఆదుకోవాలని అర్థిస్తున్న రైతన్న...

ఎకరానికి 20 వేల వరకు వెచ్చించామంటున్న సాగుదారులు... తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అర్థిస్తున్నారు. ఇటు పంట పెట్టుబడి, అటు కౌలు ద్వారా... భారీ మొత్తంలో చేతులు కాల్చుకున్నట్లయిందని కౌలు దారులు ఆవేదన చెందుతున్నారు. అసలే కొవిడ్ ప్రభావంతో ఆర్నెల్లుగా పడ్డ అవస్థలకు ఇప్పుడు... అననుకూల వాతావరణమూ తోడైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీచూడండి:ఓ వైపు వర్షం... మరో వైపు అంధకారం... నగరవాసుల ఇక్కట్ల పర్వం

ABOUT THE AUTHOR

...view details