తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతర్జాలమే హద్దు.. అవినీతి వద్దు - ts bpass in nalgonda

నల్గొండ పురపాలికల్లో భవనాల నిర్మాణం, వెంచర్లు చేపట్టాలంటే గతంలో ఒకింత ఇబ్బందులు ఎదురయ్యేవి. సవాలక్ష పత్రాలతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్ప వీటి నిర్మాణానికి అనుమతి రాని పరిస్థితి. ఇక మీదట ఆ తలనొప్పులు తగ్గనున్నాయి. ఇంట్లో నుంచే భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులు లభించనున్నాయి.

easy to get permissions for buildings and ventures in telangana with ts bpass act
అంతర్జాలమే హద్దు.. అవినీతి వద్దు

By

Published : May 24, 2020, 9:23 AM IST

నల్గొండ పురపాలికల్లో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘టీఎస్‌ బీపాస్‌’ (తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సిస్టం ఆఫ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌) చట్టాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన వచ్చేనెల 2 నుంచి అమలులోకి తేనుంది. గతేడాది ఆగస్టులో కొత్త చట్టాన్ని తీసుకువచ్చిన ప్రభుత్వం తొలుత కొన్ని పురపాలికల్లో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.

ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట పురపాలికలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు పురపాలికల్లో ఆన్‌లైన్‌లోనే భవన నిర్మాణాలకు అనుమతులిస్తుండగా.. వచ్చే నెల రెండు నుంచి ఉమ్మడి జిల్లాలోని 18 పురపాలికల్లోనూ ఈ పద్ధతిలోనే అనుమతులు ఇవ్వనున్నారు. ఈ విధానంలోనే లే అవుట్లకు కూడా అనుమతులిస్తారు.

కొత్త పురపాలిక చట్టం ప్రకారం 75 చదరపు గజాలలోపు ఇళ్లు నిర్మించుకునే వారి నుంచి నామమాత్ర రుసుం కింద రూ.1 వసూలు చేయనున్నారు. అంతకు మించి విస్తీర్ణంలో నిర్మించుకోనున్న భవనాలు, వ్యాపార సముదాయాలు, అపార్ట్‌మెంట్ల అనుమతులకు వివిధ ధరలు నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలోపు సంబంధిత యజమానికి ఆ పురపాలిక అధికారులు విధిగా అనుమతులు మంజూరు చేయాల్సిఉంది.

నామమాత్రం కానున్న పట్టణ ప్రణాళిక విభాగం

గతంలో అనుమతులు పొందాలంటే పట్టణ ప్రణాళిక విభాగం కీలకంగా పనిచేసేది. అనుమతులివ్వాలంటే కొంతమంది అధికారులు కొర్రీలు పెట్టేవారు. కొత్తగా రానున్న టీఎస్‌ బీపాస్‌లో ఇలాంటివేవీ ఉండవు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే డీటీసీపీ (డైరెక్టర్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) నుంచి అనుమతులు రాగానే క్షేత్రస్థాయిలోని అధికారులు సంబంధిత దరఖాస్తు నిజమా? కాదా? అని పరిశీలిస్తారు. దీనికి కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై అనుమతుల విషయంలో పట్టణ ప్రణాళిక విభాగం పాత్రేమీ ఉండదు. వీరి విధులు ఇకపై ఏంటన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

తేడా వస్తే అంతే...

ఆన్‌లైన్‌లో కదా అని.. భవన నిర్మాణానికి సంబంధించి తప్పుడు ధ్రువీకరణలతో దరఖాస్తు చేసినా, తప్పుడు సమాచారంతో అనుమతులు పొందినా ఎలాంటి నోటీసు లేకుండా ఆ భవనాన్ని కూల్చే అధికారం కొత్త చట్టంలో అధికారులకు ఉంది. భవన యజమానులు చాలా కచ్చితత్వంతో కూడిన కొలతలతో ఇళ్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏర్పడిన పురపాలికల్లో చాలినన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు లేవు. అధికారులు రెండు, మూడు పురపాలికలకు ఒకరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రతువంతా ఆన్‌లైన్‌లోనే సాగడంతో పత్రాల ధ్రువీకరణ, క్షేత్ర పరిశీలనలో కొంత ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయం ఉంది.

ABOUT THE AUTHOR

...view details