లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నందున... ఇన్నాళ్లూ మరిచిన బంధాలెన్నో చిగురిస్తున్నాయి. పిల్లా పాపలతో ఇల్లంతా సందడిగా మారింది. ఇన్నాళ్లూ కనబడని ఇల్లాలి కష్టం కళ్లకు కట్టినట్లు సాక్షాత్కరిస్తోంది. కుటుంబం.. ఆరోగ్యం.. ఆప్యాయతల విలువ తెలుస్తోంది. కరోనా పుణ్యమాని ఇంటింటా ఈ వాతావరణం కనిపిస్తోంది. ఓ సామాన్యుడి అనుభూతికి అక్షర రూపమిస్తే... నేను ఓ పట్టాన ఇంట్లో ఉండేవాడిని కాను. ఉద్యోగం, వ్యాపారం, స్నేహితులు, బ్యాంకు బ్యాలన్స్.. ఇవీ నిత్యం నన్ను పలకరించేవి. నేను ఇంటి పట్టునే ఉన్నాక నాకెన్నో సంగతులు తెలుస్తున్నాయి.
ఇల్లాలి తెలివికి జై
రోజూ బడికి వెళ్లొచ్చే కుమారుడు, కూతురు ఇంట్లోనే ఉన్నా నా ఒళ్లో వాలినప్పుడు ఆ స్పర్శ దూరమైన సంగతి తెలిసి బాధేస్తోంది. ఉల్లిపాయలు కోస్తూ కంట్లో నీరొచ్చిన తల్లి దగ్గరకు వెళ్లి ‘ఏంటమ్మా.. ఎందుకేడుస్తున్నావ్?’ అని అడిగినపుడు ఉల్లిపాయ సంగతి చెబితే అంతా నవ్వినపుడు సంతోషం విలువ తెలిసింది. దేశదేశాల్లో కరోనా విజృంభిస్తున్న తీరు, ఆయా దేశాల నడవడిక, ఆహారపు అలవాట్లన్నీ చర్చిస్తే పేద్ద ‘సాంఘిక శాస్త్రమే’ చదివినంత పనయింది. ఇన్నాళ్లూ ఇంటినిండా సరకులున్నా ఏదో తెలియని వెలితి. ఇప్పుడు కూరగాయలు ఇంట్లో లేకున్నా పోపు డబ్బాలు సర్దేస్తూ పప్పులతోనూ వండి వార్చేస్తున్న ఇల్లాలి తెలివికి జై కొట్టాలనిపిస్తోంది.
రెండు చేతులతో నమస్కారం
ఉదయం లేచింది మొదలు రోజంతా ఇంటి పనుల్లో బాధ్యతగా ఆమె పడుతున్న కష్టం నన్ను కదిలించింది. ఇంటిల్లిపాది ఒకరికొకరు కొసిరి కొసిరి వడ్డించుకుంటుంటే చూడ ముచ్చటగా ఉంది. నాటి తరం వారంతా పప్పులతోనే రకరకాల ఘుమఘుమలు రుచి చూపించిన తీరు ఔరా అనిపించింది. మనకు బామ్మ చెబుతుండేది. ఒరేయ్! పాశ్చాత్య సంస్కృతిని వీడు. ఆ షేక్‌హ్యాండ్‌లేమిట్రా, బుద్ధిగా రెండు చేతులతో నమస్కారం పెట్టు అనేది. కానీ మనం వినిపించుకున్నామా!? ఇప్పుడు కరోనా పుణ్యమాని రెండు చేతులతో నమస్కరిస్తున్నాం. ఇప్పుడు ఇంట్లో ఉంటే వాహనాల రొద కనుమరుగైంది. కాలుష్యం లేని గాలి మనచుట్టూ వీస్తోంది.
ఇకనుం‘చైనా’ వీటిని పాటించాలి సుమా!
తల్లిదండ్రుల ముందు నేను వినయ విధేయతలు ప్రదర్శిస్తుంటే.. చిన్నారులు కూడా నేర్చుకునే అవకాశం కలిగింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారంతో భయం, బాధ్యత, హాస్యోక్తులు అన్నీ ఒక విధమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విటర్, టిక్‌టాక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలన్నీ ’కరోనా’ చుట్టూ తిరుగుతూ చేస్తున్న హితబోధ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఇంట్లోనే ఉండాలనేది నా ఉద్దేశం కాదు. కానీ కొన్నాళ్లకే నాకు కరోనా జీవిత పాఠాన్ని నేర్పింది. ఇకనుం‘చైనా’ వీటిని పాటించాలి సుమా! అని గుర్తు చేస్తోంది.