నిర్లక్ష్యాలకు నిలయంగా మారుతున్నాయి కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు. వైద్య సిబ్బంది అలసత్వం సైతం రోగులు, గర్భిణుల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి దూది కడుపులోనే వదిలేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.
పట్టణానికి చెందిన రేర్లకంటి జ్యోతి( 20),భర్త మణికంఠ(25)తో కలిసి ఈనెల 3న ప్రభుత్వ ఆస్పత్రిలోని మాత శిశు సంరక్షణ కేంద్రానికి వచ్చారు. ప్రసవం అనంతరం ఆ మహిళకు శస్త్ర చికిత్స చేశారు. ప్రసవం కోసం వచ్చిన మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేసి దూదిని కడుపులోనే ఉంచారని బాధితులు ఆందోళన చేశారు. బాధితురాలికి మల విసర్జన కాకుండా కడుపు ఉబ్బినట్లు ఉండటం.. కడుపులో నొప్పి అనిపించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ తీయించారు. దీంతో కడుపులో దూది ఉన్నట్లు తెలిసింది.
దూది కడుపులోనే ఉంచి కుట్లు వేశారని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని ఆమె భర్త నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు నీకు దిక్కు ఉన్న చోటా చెప్పుకోమని చెప్పడంతో రాత్రి ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. శస్త్ర చికిత్స సమయంలో కుట్లు వేసినప్పుడు పైభాగాన అలానే ఉంచుతారని సూపరింటెండెంట్ తల తిక్కలేని సమాధానం చెప్పారని బాధితులు తెలిపారు. సీఎంకు చెప్పుకుంటారా.. చెప్పుకోండి అంటూ ఆయన వచ్చి చేస్తారా కాన్పులు అని డాక్టర్లు అన్నారని బాధితులు ఆరోపించారు.