జిల్లాల పునర్విభజన చేశాక మొదటి ముసాయిదాలో ప్రకటించిన గట్టుప్పల్ గ్రామాన్ని ఎందుకు మండలంగా ప్రకటించలేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. శాస్త్రీయ పద్దతిలో పనులు చేయకుండా అడ్డగోలుగా తన అనుచరుల కోసం కొత్తగా మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అవగాహన రాహిత్యంతోనే తెలంగాణలో మళ్లీ ఇలాంటి ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయన్నారు. ఈ మేరకు నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో గంగిడి మనోహర్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షలో డీకే అరుణ పాల్గొని.. దీక్షను విరమింపజేశారు.
'అవగాహనా రాహిత్యంతోనే ఇలాంటి ఉద్యమాలు' - భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వార్తలు
నల్గొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో గట్టుప్పల్ మండల సాధన కోసం భాజపా ఆధ్వర్యంలో గంగిడి మనోహర్ రెడ్డి చేపట్టిన నిరాహారదీక్షలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. దీక్షను విరమింపజేసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని చూస్తున్న ముఖ్యమంత్రికి భాజపా తగిన గుణపాఠం చెప్తుందన్నారు. రైతుల పట్ల కపట ప్రేమలు ఒలకబోసిన కేసీఆర్.. ఋణమాఫీ ఎందుకు చేయడం లేదో జవాబు చెప్పాలన్నారు. రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కునే సత్తా భాజపాకి ఉందని తెలిపారు. పూటకోమాట మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్కు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలు కళ్లు తెరిపించాయన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు నోటీసులు