కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదంటూ తెరాస నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రవికుమార్ తరఫున ప్రచారం నిర్వహించారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెం, కొట్టాల గ్రామాల్లో ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్లు పంపిణీ చేయలేదని విమర్శించారు.
తెరాసకు భయం
సీఎం కేసీఆర్ పాలన బాగుంటే సాగర్ ఉప ఎన్నిక కోసం తెరాస యంత్రాంగం నెలల కొద్దీ శ్రమించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. తెరాసపై ప్రజలకు అభిమానం ఉంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఉండి పిలుపునిచ్చినా ఓట్లు పడతాయని ఎద్దేవా చేశారు. దుబ్బాక, హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్‌కు భాజపా అంటే భయం పట్టుకుందని అభిప్రాయపడ్డారు.