నల్లగొండ జిల్లా దేవరకొండ పురపాలిక కో-అప్షన్ పదవుల భర్తీ ప్రక్రియ అధికార పార్టీలో ఇంటిపోరును రాజేస్తోంది. కో-అప్షన్ పదవులకు ఈ నెల 7న ఎంపిక చేయనుండగా... సొంత పార్టీ కౌన్సిలర్ల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. అన్ని స్థానాలు సునాయాసంగా కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ... వారిలో భిన్నాభిప్రాయాల నేపద్యంలో ఆశవాహుల నుంచి అభ్యర్థుల ఎంపిక రసవత్తరంగా మారింది. పురపాలిక ఎన్నికల్లో తమ ప్రత్యర్థులుగా నిలిచి ఓటమీ పాలైన వారిని కో-అప్షన్ సభ్యులుగా నియమిస్తే... వార్డుల్లో తమకు ఇబ్బందికరంగా మారుతుందని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేవరకొండలో 20 స్థానాలకుగానూ... 12 చోట్ల తెరాస అభ్యర్థులు గెలిచారు. దీంతో పదవి తెరాసకే దక్కింది. కో-అప్షన్ సభ్యులను ఎంపిక చేద్దామనుకున్న 3, 4, 11, 12 వార్డుల్లో అధికార పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడి నుంచి ఎంపిక చేస్తే తమకు గుదిబండలుగా మారే అవకాశంగా ఉందని కౌన్సిలర్లు వాపోతున్నారు. పార్టీ కౌన్సిలర్లు లేని చోట కో-ఆప్షన్ సభ్యులను ఎంపిక చేస్తే... ఆయా స్థానాల్లో పార్టీ బలంగా తయారు కావొచ్చని సూచిస్తున్నారు.
దేవరకొండలో రసవత్తరంగా కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక - దేవరకొండ వార్తలు
కో-ఆప్షన్ పదవుల ఎంపిక... నల్గొండ జిల్లా దేవరకొండ తెరాసలో ముసలం పుట్టిస్తోంది. తెరాస కౌన్సిలర్లు గెలిచిన వార్డుల నుంచి కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. భవిష్యత్లో తమకు ఆటకంగా మారే అవకాశం ఉన్నందున... పార్టీ నిర్ణయించినప్పటికీ సమ్మతి తెలుపకూడదని నిర్ణయించుకున్నారు.
ఈ పరిమాణాలు భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మార్చే స్థాయిలో అసంతృప్తికి దారి తీయగలరని శ్రేణులు భావిస్తున్నాయి. తమ వార్డులో పోటీగా మరో నాయకుని తయారు చేయడాన్ని తెరాస కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విదంగా పార్టీ నిర్ణయిస్తే కలహాల కాపురంగా మారే పరిస్థితులను చేజేతులా చేయడమేనని పలువురు కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు.
వివిధ రాజకీయ పరిణామాలతో అధికారపార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్, భాజపా కౌన్సిలర్లతో కలిపి 15మందితో రాత్రి వ్యవసాయ క్షేత్రంలో రహస్యంగా సమావేశం నిర్వహించుకున్నారు. ఎలాగైనా తమకు గుదిబండగా మారే వ్యక్తులను పార్టీ నిర్ణయించిన్నప్పటికీ మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో అధికార పార్టీలో అంతర్మధనం నెలకొంది. రానున్న రోజుల్లో దేవరకొండలో రాజకీయ సమీకరణాలు మరింతగా మారేలా కనిపిస్తున్నాయి.