దుందుభి వాగుపై నిర్మించిన డిండి ప్రాజెక్టు.. 42 రోజులుగా అలుగు పోస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ దశాబ్ద కాలంలో మూడుసార్లు మాత్రమే.. డిండి అలుగు పోసింది. 'హైదరాబాద్-శ్రీశైలం' మార్గంలో ఇపుడున్న వంతెన.. 2017లో అందుబాటులోకి రాగా... అంతకుముందు రహదారి పైనుంచే వరద పారేది. వాగు ఒడ్డున ఉన్న డిండి గ్రామాన్ని అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న ప్రాంతానికి మార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. చెక్‌డ్యాంలు లేక.. మత్తడి దూకిన నీరు నాగార్జునసాగర్‌లో కలుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4.2 టీఎంసీలు వృథా అయినట్లు అధికారులు చెబుతున్నారు. కేవలం వర్షాధారంగా నిర్మితమైన డిండి ప్రాజెక్టు గరిష్ఠ నిల్వ సామర్థ్యం 2.4 టీఎంసీలు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి 2016లో అర టీఎంసీ నీటిని తీసుకుని.. డిండి మండలంలో 4 కుంటలు నింపారు. 2017లోనూ కేఎల్ఐ ద్వారా 34.5 అడుగులు నిల్వ చేసి.. డిండి, చందంపేట, దేవరకొండ మండలాల్లో 54 చెరువులు సహా తాగునీటిని అందించారు.ఈ స్థాయిలో వరద రావడం వల్ల డిండి ఆయకట్టుదారుల్లో సంతోషం కనిపిస్తోంది.
36అడుగులకు మించి నీరు ప్రవహిస్తేనే..
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల సమీపంలో బ్యారేజీ నిర్మించి.. నల్గొండ జిల్లాలోని సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయినిపల్లి, శివన్నగూడెం ప్రాజెక్టులకు నీరు అందించాలన్న ప్రతిపాదనలున్నాయి. అటు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోసి నీటిని తరలించాలని భావించారు. 36 అడుగులకు మించి నీరు ప్రవహిస్తేనే అలుగు సాధ్యమవుతుంది. అంటే నెలన్నర నుంచి డిండి జలాశయం... పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడుతోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూగర్భజలాలు పెరగడంతోపాటు... ఎడమ కాల్వ కింద 12 వేల 750 ఎకరాలు సాగవుతోంది. కుడికాల్వ ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలో మరో 250 ఎకరాలకు నీరందుతోంది.