అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షాలు Crops Damaged due to Untimely Rains: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షాలతో అన్నదాతకు తీవ్ర నష్టం వాటిల్లింది. దేవరకద్ర, వనపర్తి, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో ఆరబోసుకున్న వరి, మొక్కజొన్న తడిసిపోయింది. వనపర్తి జిల్లాలో వనపర్తి, గోపాల్ పేట, పెద్దమందడి, ఖిల్లా ఘనపూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలకు అమ్మకాల కోసం తీసుకువచ్చిన ధాన్యం తడిసిపోయింది. ఇవి కాకుండా ఇప్పటికే కోతలు పూర్తై కల్లాల్లో ఉన్న ధాన్యం సైతం వానలకు దెబ్బతింది.
కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం నీటి పాలు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు 5లక్షల ఎకరాల్లో వరి సాగైతే... 30 నుంచి 50శాతం వరకూ కోతలు పూర్తయ్యాయి. కోతలకు తగ్గట్లుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో... కల్లాల్లో ఆరబెట్టి అమ్మేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం నీటిపాలైంది. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట నియోజక వర్గాల్లో వరిచేలు నేలకొరిగాయి. వడ్లు రాలిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు నష్టపోయారు. జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మామిడి నేలరాలింది.
చెరువులను తలపించిన ధాన్యం నిల్వ రాశులు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతును వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. నలగొండ జిల్లా చిట్యాల, రామన్నపేట, వెలిమినేడు మండలాల్లో ధాన్యం నిల్వచేసిన ప్రాంతం చెరువులను తలపించింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అన్నదాతలు అవస్థలు పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో కొనుగోలు కేంద్రంలో వడ్లు వర్షపు నీటికి కొట్టుకుపోయాయి. భువనగిరి మార్కెట్ యార్డులో వర్షానికి ధాన్యం రాశులు నీటిలో కొట్టుకు పోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, బొమ్మల రామారం, భువనగిరి, మోటకొండూరు, రాజపేటలో పంటకు నష్టం వాటిల్లింది. యాదగిరిగుట్ట మండలం చోల్లేరు గ్రామంలో పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాశులు తడిసిపోయాయి.
చేతికొచ్చిన పంట వర్షార్పణం:ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ అకాల వర్షాలు రైతుకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. సిద్దిపేట జిల్లాలోని కొండపాక, చిన్నకోడూర్, దుబ్బాక, తొగుట, భూంపల్లి, మిర్‌దొడ్డి మండలాల్లో వడగళ్లు పడి... చేతికొచ్చిన వరి పంట పూర్తిగా దెబ్బతింది. మెదక్ జిల్లా కౌడిపల్లి, పాపన్నపేట, చిన్న శంకరం పేట, కొల్చారం, చేగుంట, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలుల వల్ల మామిడి తోటలు దెబ్బతిన్నాయి. చెట్ల మీద నుంచి కాయలు రాలిపడిపోయాయి. గజ్వేల్ నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మామిడి, ఇతర ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇవీ చదవండి: