చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామనే దశలో... అకాల వర్షాలు రైతుల్ని నట్టేట ముంచేశాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో... 20 కోట్ల మేర పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. గత రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తోడు ఈదురుగాలుల బీభత్సంతో... వరి, మామిడి, నిమ్మ, బత్తాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలోని బీబీనగర్, పోచంపల్లి, భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, గుండాల మండలాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి, మాడుగులపల్లి, నిడమనూరు, డిండి, మర్రిగూడ... సూర్యాపేట జిల్లాలోని మోతె, చివ్వెంల, మునగాల, పెన్పహాడ్ మండలాల్లో... 10 వేల ఎకరాలకు పైగా పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో... ఇంచుమించు 4 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తేల్చారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా
యాదాద్రి జిల్లాలోనే 5 వేల 127 ఎకరాల వరి వర్షార్పణమైంది. ఐకేపీ, మార్కెట్ కమిటీలకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని... వివిధ ప్రాంతాల్లో అన్నదాతలు రోడ్డెక్కారు. నల్గొండ జిల్లాలో అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై బైఠాయించారు. ధాన్యాన్ని వెంటనే కొనాలంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... నకిరేకల్ మార్కెట్ యార్డులో శుక్రవారం సాయంత్రం వరకు దీక్ష చేపట్టారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ దీక్షా స్థలికి వచ్చి... 5 రోజుల్లో పంటను కొంటామని చెప్పడంతో నిరసన విరమించారు.