ఉమ్మడి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల సరిహద్దులకు.. రాష్ట్ర రాజధాని సమీపంలో ఉంటుంది. ఏ చిన్న అవసరమొచ్చినా అక్కడి ప్రజలు జంటనగరాలను ఆశ్రయిస్తుండటం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గత నెల 27 నుంచి ఇప్పటివరకు మూడు జిల్లాల పరిధిలో 150కి పైగా కేసులు నమోదవడం... పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం.. కొవిడ్ బారిన పడింది. మంగళవారం ఏకంగా 26 కేసులు నమోదవడం వల్ల తొలినాళ్లలో వెలువడిన తీరును జ్ఞప్తికి తెస్తోంది. ఏప్రిల్ 19 నాటికి నల్గొండ జిల్లాలో, అదే నెల 22 వరకు సూర్యాపేట జిల్లాలో.. పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆయా జిల్లా కేంద్రాలను పూర్తిస్థాయిలో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి.. పటిష్ఠ లాక్‌డౌన్ అమలు చేశారు. ఆ తర్వాత రెండు నెలల వరకు యాదాద్రి భువనగిరి మినహా.. ఆ రెండు జిల్లాల్లో పెద్దగా కేసులు నమోదు కాలేదు. పూర్తి స్తబ్ధుగా మారిపోయిన సదరు పట్టణాలను.. కొవిడ్ రహిత ప్రాంతాలుగా భావించారు. కానీ మళ్లీ పాత రోజుల్ని గుర్తుకు తెస్తూ.. గత జూన్ చివరి వారం నుంచి కేసులు పెరిగిపోతూ ఆందోళనకర పరిస్థితిని కలిగిస్తున్నాయి.
గత పదకొండు రోజుల్లో నల్గొండ జిల్లాలో 90కి పైగా నమోదవగా.. సూర్యాపేట జిల్లాలో 29, యాదాద్రి జిల్లాలో 32 కేసులు బయటపడ్డాయి. అనతికాలంలోనే 150 మార్కును దాటడం... ప్రమాదకర సంకేతాలనిస్తోంది. ఇంతకుముందు కేవలం జిల్లా కేంద్రాల్లోనే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడది మండల స్థాయిలోనూ విలయతాండవం చేస్తోంది. దేవరకొండ, చింతపల్లి, హాలియా, నేరేడుచర్ల, కోదాడ, ఆలేరు, యాదగిరిగుట్ట వంటి ప్రాంతాల్లోనూ.. ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌లు నిర్ధరణ అవుతున్నాయి. దీనికితోడు ప్రాథమిక కాంటాక్టులను గుర్తించి పరీక్షలకు పంపే నమూనాల సంఖ్య.. భారీగా ఉంటోంది. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 17 వందల 92 నమూనాలు సేకరించగా.. ఇంకా 277 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
మంగళవారం ఒక్కరోజే 19 కేసులు వెలుగుచూడటం వల్ల ఈ 277 మందిలో ఇంకా ఎంతమందిక కరోనా సోకిందోనన్న ఆందోళన అంతటా కనిపిస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని వాణిజ్య దుకాణాలు.. పరిమిత సమయం వరకు మాత్రమే పనిచేస్తాయని ఆయా సంఘాలు ప్రకటించాయి. మరోవైపు గత నెల రోజులుగా బయటపడుతున్న కేసుల్లో 90 శాతం.. రాష్ట్ర రాజధానికి వెళ్లివచ్చినవారివే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి.
ఇవీ చూడండి:ప్రైవేట్‌లో వైద్యానికి నో చెప్పొద్దు.. ఫీజులెక్కువ అడగొద్దు: గవర్నర్