తెలంగాణ

telangana

ETV Bharat / state

ముక్కలవుతున్న కుటుంబాలు.. ఛిద్రమవుతున్న బతుకులు - corona deaths in nalgonda district

మాయదారి మహమ్మారి మానవత్వానికి మసిపూసి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. బంధాలను కొడిగట్టుకుపోయేలా చేస్తోంది. ఇన్నాళ్లూ కళ్లముందే ఆప్యాయంగా మెలిగిన వారిని.. కడచూపు కూడా చూసుకోకుండా చేస్తోంది. అయినవాళ్లను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే వారు కూడా కరవయ్యే దుస్థితిని కల్పిస్తోంది. వైరస్ సోకి మృతి చెందిన కన్నవాళ్లను చూసుకోనివ్వకుండా పిల్లలతో కన్నీరు పెట్టిస్తోంది. ఆరోప్రాణంగా గుండెలమీద పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలను వారి కళ్లముందే కడతేర్చి కన్నపేగుకు నరకం చూపిస్తోంది. కండబలమున్న వాడైనా, గుండె ధైర్యమున్న వాడైనా.. తాను సోకితే మట్టిలో కలవాల్సిందేనని కాలర్ ఎగరేస్తున్న జడలు చాస్తున్న కరోనాను ఎదుర్కోలేక ఎంతో మంది కన్నుమూస్తున్నారు. కొవిడ్​ను ఎదురొడ్డి.. ప్రాణాలకై రోజుల తరబడి పోరాడి.. చివరకు గెలిచినా.. ఆరోగ్యం సహకరించక మరెంతో మంది మృత్యుఒడిలో ఒదిగిపోతున్నారు.

corona effect on relations, corona effect on families
బంధాలపై కరోనా ఎఫెక్ట్, బంధాలపై కరోనా ప్రభావం, కుటుంబాలపై కరోనా ఎఫెక్ట్

By

Published : May 22, 2021, 1:30 PM IST

  • నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన అతను.. ఓ కుల సంఘం నాయకుడు. అందర్నీ కలుపుకుని పోయే వ్యక్తిత్వంతో నిత్యం ఆయన వెంట పది మంది ఉండేవారు. ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం కూడా చేసేవాడు. కానీ... వారం క్రితం కరోనా సోకి హైదరాబాద్​లో ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ శ్మశాన వాటికలో రూ.20 వేలు ఇచ్చి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగి ఎనిమిది రోజులవుతున్నా ఆయన కుటుంబాన్ని పరామర్శించినవారు లేరు.ఇంటి యజమానిని కోల్పోయిన ఆ కుటుంబానికి నాలుగు మాటలు చెప్పి ధైర్యం ఇచ్చేవారే కరవయ్యారు.
  • సూర్యాపేటకు చెందిన ఆ కుటుంబంలో 45 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఆయన తల్లిదండ్రులకూ మహమ్మారి అంటుకుంది. తల్లిని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో, తండ్రిని ప్రైవేటు దవాఖానాలో చేర్పించగా.. సదరు వ్యక్తి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాడు. హైదరాబాద్​లో కుమారుడు.. సూర్యాపేటలో తండ్రి గంటల వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరారు. నగరంలో తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన పిల్లలు.. సూర్యాపేటలో తాతకు తుదివీడ్కోలు పలికారు. అటు భర్త, ఇటు కొడుకుని కడచూపు కూడా చూసుకోలేని ఆ వృద్ధురాలి బాధ వర్ణనాతీతం.

ఇంతకాలం బాగా బతికాడు. ఎంతుండి ఏం లాభం... క్షణాల్లో చితిలో కలిసిపోయాడు... ఇదీ శ్మశాన వైరాగ్యం. ఈ వైరాగ్యమనేది కేవలం శ్మశానం వరకే పరిమితం కాలేదు. అది ఎన్నో కుటుంబాలను రోజులు, నెలల పాటు వేదనకు గురిచేస్తూనే ఉంది. మాయదారి రోగంతో మనుషుల జాడే తెలియకుండా పోతున్న ఈ రోజుల్లో... కోటీశ్వరుడైనా, కూటికి గతి లేని వాడైనా చివరి ఘడియల్లో అంతా సమానమే అన్న ధోరణి కళ్లకు కడుతోంది.

ఒక్క నెలలోనే 19 మంది

నల్గొండ జిల్లా ఆసుపత్రిలో ఈ నెలలో 19 మంది ప్రాణాలు కోల్పోతే, అందులో ఎవరూ లేని వారు ఐదుగురు, అందరూ ఉండి అనాథల్లా మరో 14 మంది లోకం విడిచి వెళ్లిపోయారు. అంత్యక్రియలకూ కుటుంబీకులు దూరంగా ఉంటున్నారు. తమకేమవుతుందోనన్న ఆందోళనే రక్త సంబంధాన్ని చివరి చూపు చూసుకోనీకుండా చేస్తోంది. మృతదేహం ద్వారా కొవిడ్ సోకదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు వైద్య నిపుణులు స్పష్టం చేసినా.. ప్రజల్లో ఆ భయం మాత్రం పోవడం లేదు.

భయంతో మరణం

యాదాద్రి జిల్లాలో ఒక రోగి కరోనా నుంచి కాస్త కోలుకున్న తర్వాత ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. తన రెండు పక్కల ఉన్న ఇద్దరు హఠాత్​గా మరణించడంతో తనకేమవుతోందనని భయాందోళనకు గురయ్యాడు. ఆ వ్యక్తి కూడా కాసేపట్లోనే మృత్యు ఒడిలో ఒదిగిపోయాడు. ఇలాంటి ఘటనలో చాలా చోట్ల జరుగుతున్నాయి. కరోనా సోకి.. తగ్గిపోయే ఆరోగ్య స్థితి ఉన్నా.. భయంతోనే చాలా మంది కన్నుమూస్తున్నారు.

మహమ్మారి సోకకుండా ముందుగానే అప్రమత్తంగా ఉంటున్నా.. కొన్నిసార్లు దాని బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. వైరస్ సోకిన తర్వాత ఎన్ని మందులు వేసుకున్నా.. ఎంత చికిత్స చేసినా.. మనోధైర్యంతో లేకుండా మరణం తప్పడం లేదు. కరోనా చేస్తున్న కరాళ నృత్యానికి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మానవ బంధాలన్ని మట్టిలో కలిసిపోతున్నాయి. తమ వారిని కడచూపు కూడా చూసుకోలేక కుమిలిపోతున్న గుండెలెన్నో.. అయినవాళ్లని కోల్పోయి బిక్కిబిక్కుమంటూ గడుపుతున్న వారికి కాస్త ఓదార్పునిచ్చే వారు కూడా కరవై నలిగిపోతున్న జీవితాలెన్నో...

ABOUT THE AUTHOR

...view details