కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాయి. వైరస్ నివారణకు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం జనాల్లో అవగాహన కలిగించేందుకు తమ వంతు కృషి చేస్తున్నాయి. కానీ కొంతమంది ప్రజలు మాత్రం... ఎవరెంత నెత్తీ, నోరు బాదుకొని వేడుకుంటున్నా... తమకేమీ పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేస్తూ... వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.
కరోనానా... అంటే ఏంటో మాకు తెలియదే...! - సామాజిక దూరాన్ని మరచిన నల్గొండ జిల్లా వాసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గుతున్న దాఖలాలు లేవు. కరోనా కాటుకు బలవ్వకూడదని... కరచాలనం సైతం వద్దంటున్నారు వైద్య నిపుణులు. అలాంటిది జనాలంతా గూమిగూడి ఒకే చోట సమూహంగా ఏర్పడితే పరిస్థితేంటీ? వైరస్ వ్యాప్తికి సులువుగా రాజ మార్గం దొరికినట్టే కదా..! ప్రస్తుతం బ్యాంకుల వద్ద సరిగ్గా ఇలాంటి దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. వైరస్ విరుచుకుపడే అవకాశాలిచ్చేలా విపత్కర పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తాజాగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు భౌతిక దూరం పాటించకుండా, బాధ్యత మరచి బారులు తీరారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదే పదే చెబుతున్నా.. తమకేమీ పట్టనట్లుగా బ్యాంకుల వద్దకు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. కరోనా కష్టకాలంలో రైతుబంధు డబ్బులు, ఇతర లావాదేవీల కోసం బ్యాంకులకు జనాలు అధిక సంఖ్యలో వస్తున్నారు. పట్టణంలో రోజురోజుకు వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో భౌతిక దూరాన్ని మరచి ఖాతాదారులు వ్యవహరిస్తున్న తీరు... స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పరిస్థితులు చేయిజారక ముందే బ్యాంకుల వద్ద ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించి... జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి :కరోనా వ్యాప్తిలో కూడా తెలంగాణ నెంబర్ వన్: మల్లు రవి