పది రోజులుగా నాగార్జనసాగర్ నియోజకవర్గంలో భారీగా కొవిడ్ కేసులు పెరిగాయి. గతంలో రోజుకు 10 నుంచి 25 పాజిటివ్ కేసులు వస్తున్న చోట... ప్రస్తుతం ఏకంగా 150కి పైగా వస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 739 పాజిటివ్ కేసులున్నాయి. సోమవారం 174 వైరస్ నిర్ధరణ కాగం మంగళవారం ఏకంగా 195 మందికి మహమ్మారి సోకింది. ఇటీవల ఖమ్మంలో వైఎస్ షర్మిల నిర్వహించిన భారీ బహిరంగసభలోనూ 100 మంది వైరస్ బారినపడినట్లు... ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పోలీసులు నిర్దేశించిన నిబంధనలు పాటించకుండా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా నిర్వహించడం వల్లే... మహమ్మారి కోరలు చాస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సాగర్‌లో కరోనా కల్లోలం... వారంలో భారీగా పెరిగిన కేసులు
కరోనా కల్లోలానికి ఎన్నికలూ తోడవుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రధాన పార్టీల నాయకులు సహా కార్యకర్తలు ఎక్కువ మంది పాజిటివ్‌గా తేలింది. సభలు, సమావేశాలకు హాజరైన వారిలో అనేకమంది కొవిడ్ బారిన పడ్డారు. క్రమంగా బాధితుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఈనెల 10 నుంచి 18వ తేదీ వరకు సాగర్ నియోజనకవర్గంలో పాజిటివ్ రేటు10.8 శాతం ఉంటే రెండు రోజుల్లో చేపట్టిన పరీక్షల్లో 25 శాతం వరకు పెరిగింది. మండలాలవారీగా... కొవిడ్ కేసుల విషయానికొస్తే పెద్దవూరలో115, అనుముల, తిరుమలగిరిలో 104, నాగార్జునసాగర్‌లో 66.. గుర్రంపోడులో 35 కేసులు నమోదయ్యాయి. త్రిపురారంలో 26, నిడమనూరులో 23 మందికి వైరస్ సోకింది. రెండ్రోజుల వ్యవధిలోనే 369 మందికి పాజిటివ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల వేళ... మాస్కులు లేకుండా ప్రచారాలు నిర్వహించారంటూ తెరాస, భాజపా అభ్యర్థులు సహా మరికొందరిపై 120 కేసులు నమోదయ్యాయి. ఐదు కంటే ఎక్కువ వాహనాలు వినియోగించి... కాన్వాయ్ నిబంధనలు పట్టించుకోలేదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారు.
ప్రచారాల వేళ పార్టీలన్నీ భయం లేకుండా.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. గ్రామగ్రామాన పర్యటించి జనాన్ని నేరుగా కలుసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు పోటీపడ్డారు. ఆ సమయంలో సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే పరిస్థితి ఇలా తయారైందని స్థానికులు భావిస్తున్నారు.