నల్గొండ జిల్లాలోని ఐదు మండలాల్లో ఐసీఎంఆర్ ప్రతినిధుల బృందాలు రెండోరోజు నమూనాలు సేకరించాయి. ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామంలో 40 మంది చొప్పున రోజుకు రెండు వందల మందిని పరిశీలించాయి. శుక్రవారం జిల్లాకు వచ్చిన 30 మంది సభ్యులు గల భారత వైద్య పరిశోధన మండలికి చెందిన ఐదు బృందాలు... నిన్న ఐదు మండలాల్లో పర్యటించాయి. వైద్యులు ఇవాళ గుండ్లపల్లి, నాంపల్లి, పెద్దవూర, అనుముల, కనగల్ మండలాల్లోని గ్రామాల్లో... స్థానికుల రక్త నమూనాలు తీసుకున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్న వైద్యులు.. పల్లెలోని నాలుగు దిక్కుల లెక్కన కొద్ది మందిని ఎంపిక చేసుకున్నారు. వారికి మండల వైద్యాధికారులు, గ్రామ సిబ్బంది సహకరించారు.
అటు యాదాద్రిలో...
అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో... వలస వెళ్లి తిరిగివచ్చిన కూలీలతో గ్రామాలన్నీ భయంగా కాలం గడుపుతున్నాయి. ఇప్పటికే వివిధ మండలాల్లో 20 మందికి పైగా.. పాజిటివ్ బయటపడింది. దీనితో సదరు గ్రామాల్లో భారీ భద్రత నడుమ... పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆత్మకూరు(ఎం), చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మోటకొండూరులో... ఇంటింటి సర్వే జరుగుతోంది. ఆలేరు మండలంలోని ఒక గ్రామంలో అనుమానితులున్నారన్న కోణంలో... ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.