తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహరచన

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తమ శ్రేణుల్ని సమాయత్తం చేస్తోంది. జనగర్జన పేరిట ఇవాళ హాలియాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతోపాటు... సీనియర్ నేతలంతా సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

congress
ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహరచన

By

Published : Mar 27, 2021, 4:06 AM IST

ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహరచన

నాగార్జునసాగర్‌ స్థానంలో తిరిగి పాగా వేయాలనే లక్ష్యంతో సాగుతున్న కాంగ్రెస్‌.. అందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. రెణ్నెళ్ల నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న జానారెడ్డి.. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులూ కూడగడుతున్నారు. అందరికంటే ముందుగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కాంగ్రెస్‌ జానారెడ్డిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. రాజకీయాల్లో విశేష అనుభవమున్న జానా ఇప్పటికే క్షేత్రస్థాయి నాయకులందర్నీ కలుసుకున్నారు. పార్టీ సీనియర్ నేతల్ని రప్పించి దిశానిర్దేశం చేసేలా.. శనివారం బహిరంగసభ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రధాన పట్టణమైన హాలియాలో.. సభ జరగనుంది. ఇందుకోసం ఎంసీఎం డిగ్రీ కళాశాల సమీపంలోని మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం ప్రారంభం కానున్న సభకు అగ్రనాయకులు తరలిరానున్నారు.

కాంగ్రెస్‌ కసరత్తు

నామినేషన్ల చివరిరోజైన 30న జానారెడ్డి.. రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందజేయనున్నారు. ఈ నెల 29నే నామినేషన్ వేస్తానని జానా ప్రకటించారు. కానీ అనూహ్యంగా 27, 28, 29 తేదీలను ఎన్నికల సంఘం సెలవుగా ప్రకటించడంతో చివరి రోజైన 30 నాడు నామపత్రాలు అందజేయాలని నిర్ణయించుకున్నారు. సాగర్ సెగ్మెంట్లోని 7 మండలాల నుంచి 50 వేల మందిని సభకు రప్పించేలా.. కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. పల్లెల నుంచి వచ్చిన కార్యకర్తలతో... సభ ప్రారంభానికి ముందు సైతం హాలియాలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. పార్టీ శ్రేణులు చేజారకుండా ఉండేందుకు ఈ సభ ద్వారా తెరాసకు గట్టి సందేశమివ్వాలన్న భావన కాంగ్రెస్ నేతల్లో కనపడుతోంది.

ఇదీ చదవండి: బడ్జెట్‌ అంచనాలు.. వాస్తవాల మధ్య అంతరం తగ్గాలి: కాగ్​

ABOUT THE AUTHOR

...view details