Janareddy on Priyanka Gandhi Hyderabad Tour: ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగే నిరుద్యోగ నిరసన సభకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ రానున్నందున పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. హైదరాబాద్ పరిసర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యువతను తరలించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండలో పర్యటించిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి.. ఉమ్మడి జిల్లా నుంచి భారీగా కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్న జానారెడ్డి.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అంతా సమానులే:ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో గత నెల 28న జరిగిన నిరుద్యోగ నిరసన సభను విజయవంతం చేసిన నిరుద్యోగులకు, పార్టీ శ్రేణులందరికీ జానారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అందరూ సమానులే అన్న ఆయన.. పార్టీ కోసం అందరూ కలిసి పని చేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ చిన్నచూపు చూడకూడదని సూచించారు.