Congress on munugodu: మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న హస్తం పార్టీ గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగి.... నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో మరోసారి సమావేశం అయ్యారు. ఇందులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, జావిద్, చౌదరి పాల్గొన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర్‌రెడ్డి, మధుయాష్కీ కూడా హాజరయ్యారు. అభ్యర్థి ఎంపిక సహా వివిధ అంశాలపై సమాలోచనలు చేశారు. అనంతరం పీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్ లతో ఠాగూర్ భేటీ అయ్యారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు.
తెరాస, భాజపాను ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్నామని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ తెలిపారు. ఉపఎన్నికలో తమను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. భాజపా కుట్రలకు తెరాస సహకరిస్తోందన్నారు. అభ్యర్థి ఎంపికలో జిల్లా నాయకత్వాన్ని సంప్రదిస్తామని నిర్ణయాలను వారిపై రుద్దబోమని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా గెలుపు కాంగ్రెస్‌దేనని మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు.
మునుగోడు బరిలో నిలిచేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల13 నుంచి నెలాఖరు వరకు వివిధ కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలు రూపొందించారు. పాదయాత్రతో ప్రారంభించి అమిత్ షా వచ్చే రోజున పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో తెరాస, భాజపా ఒక్కటేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒప్పందంతోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఐదు నిమిషాల్లో ఆమోదించారని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక తెరాసకు అవసరమైతే మునుగోడులో ఎన్నిక భాజపాకు అవసరముందన్నారు. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.