అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ సతమతమవుతోంది. అన్ని పార్టీలు మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే.. హస్తం నేతల్లో ఆ తీవ్రత కనిపించడం లేదు. మునుగోడు ఉప ఎన్నిక కోసం మధుయాష్కీని వ్యూహరచన కమిటీ కన్వీనర్‌గా ఏఐసీసీ నియమించింది. ఈ కమిటీతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గాంధీభవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కమిటీ కన్వీనర్‌గా ఉన్న మధుయాష్కీనే భేటీకి డుమ్మా కొట్టారు. యాష్కీ తీరుపై మానిక్కం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కరోనాతో రేవంత్‌రెడ్డి దూరమయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కీలక నేతలుగా ఉన్న జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
రేవంత్ రెడ్డి, మానిక్కం ఠాగూర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీలో దుమారం రేపింది. వీరిద్దరి తీరుతో కాంగ్రెస్ బలహీనమవుతోందని మర్రి ఆరోపించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి పని తీరు బాగోలేదని.. మానిక్కం చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మానిక్కం వ్యాఖ్యలకు నొచ్చుకున్న మహేశ్వర్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని సన్నిహితుల వద్ద వాపోయారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేస్తారా...? అనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. మానిక్కం ఠాగూర్ మాత్రం ఈ నెల 20 నుంచి మునుగోడులో ప్రచారం మొదలు పెడతామని స్పష్టం చేశారు. ఏదేమైనా నేతల అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.