Congress hunting in Munugodu: మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. వారం, పది రోజుల్లో అభ్యర్థిని ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశలో కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేపు హైదరాబాద్ వస్తున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అభ్యర్ధి ఎంపిక వ్యవహారాన్ని నల్గొండ జిల్లా సీనియర్ నాయకులకు వదిలివేయడంతో... రేపు జిల్లాకు చెందిన సీనియర్లతో సమావేశమై ఠాగూర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వస్తున్న మాణిక్కం ఠాగూర్...నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు జానారెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఈ సమావేశానికి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.