తెలంగాణ

telangana

ETV Bharat / state

జానాకు ఝలక్​... కాంగ్రెస్​కు తప్పని ఓటమి - telangana varthalu

అవకాశం అందివచ్చిందనుకున్న కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి భంగపాటు తప్పలేదు. వరుస ఎన్నికల్లో నిరాశ పరిచినా...సాగర్‌లోనైనా సత్తా చాటాలనుకున్న వ్యూహం ఫలించలేదు. ఇదే నియోజకవర్గం నుంచి ఏడు సార్లు విజయ దుందుబి మోగించిన జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చినా...ఓటమి తప్పలేదు. కాంగ్రెస్‌ పార్టీ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భాజపా అభ్యర్థికి డిపాజిట్‌ దక్కపోవడం హస్తానికి కొంత ఊరటనిచ్చే అంశం.

congress defeated in nagarjuna sagar by elections
జానాకు ఝలక్​... కాంగ్రెస్​కు తప్పని ఓటమి

By

Published : May 2, 2021, 7:55 PM IST

జానాకు ఝలక్​... కాంగ్రెస్​కు తప్పని ఓటమి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటినుంచి ఎన్నికలంటేనే హస్తానికి అగ్నిపరీక్షగా మారుతున్నాయి. ఎన్ని పరాభవాలు ఎదురైనా నాగార్జునసాగర్ ఉపఎన్నికతో పూర్వవైభవం సాధించాలని ఉవ్విళ్లూరిన...నిరాశ తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైన కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి...ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య అకాల మరణంతో వచ్చిన ఉపఎన్నికల్లో విజయం సాధించి వరుస ఓటములతో డీలా పడిన శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనుకున్నారు. కానీ, అనుకున్నదొక్కటి అయిందొక్కటి అన్నట్లుగా హస్తవాసి మారలేదు.

తీవ్రంగా శ్రమించారు..

నాగార్జునసాగర్ అభ్యర్థిగా సీనియర్‌ నేత, మాజీ మంత్రి, అనుభజ్ఞుడు.. ఆ ప్రాంతంపై పూర్తి పట్టున్న జానారెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. ఏడుసార్లు గెలిచి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూసిన జానారెడ్డికి సాగర్‌లో విజయం నల్లేరుపై నడకేనని అందరూ భావించారు. ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం.. నియోజకవర్గానికి చేసిన సేవలు కలిసి వస్తాయని అంచనా వేశారు. జానారెడ్డి సైతం ప్రచారానికి వెళ్లకుండానే గెలిచే సత్తా ఉందని తెరాసకు సవాల్ విసిరారు. కాంగ్రెస్‌ నేతలు కూడా ఆత్మవిశ్వాసం కంటే అతివిశ్వాసమే ప్రదర్శించారు. నోముల నర్సింహ్మయ్య కుమారుడు భగత్‌.. రాజకీయ ఉద్ధండుడు జానారెడ్డిని ఢీ కొట్టడం అంత తేలిక కాదని అంచనా వేశారు. కాంగ్రెస్‌ అంటేనే సహజంగా గ్రూపు తగాదాలనే ముద్ర ఉన్నా.. నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం సీనియర్లంతా కదిలారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అంతా ఏకతాటిపైకి వచ్చారు. పీసీసీ రేసులో వీళ్ల మధ్య ఆధిపత్య పోరు తలెత్తినా అంతా ప్రచార బరిలోకి దిగారు. మండుటెండల్లోనూ తీవ్రంగా శ్రమించారు.

చివరకు ఫలితం ఇలా..

నాగార్జునసాగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా జానారెడ్డి వల్లే అని కాంగ్రెస్‌ నేతలు ఏకరవుపెట్టారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఆలోచన తమదేనని ప్రచారం నిర్వహించారు. అధికారపక్షం ఎన్నికల హామీలన్నీ విస్మరించిందని నినదించారు. చివరకు ఫలితం మాత్రం కాంగ్రెస్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. గతంలో 7వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం చవిచూసిన జానారెడ్డి ఈసారి అంతకు రెట్టింపు ఓట్లు తగ్గిపోయాయి.

ఇదీ చదవండి: పక్కా వ్యూహం.. ప్రణాళిక ప్రకారం ప్రచారం

ABOUT THE AUTHOR

...view details