Palvai Sravanthi in Election Campaign: మునుగోడు ఉపఎన్నికలో పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూ విజయం కోసం పాకులాడుతున్నారు. ప్రజలకు వారు చేసిన మంచి కన్నా ఎదుటి వారి లోపాలను ఎత్తి చూపడంలో దూసుకెళ్తున్నారు. పోలింగ్‌కు వారం రోజులే గడువు ఉండడంతో... నేతలంతా విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పల్లెపల్లెన మోహరించిన నేతలు... ఇంటింటి ప్రచారం సాగిస్తుండగా రాష్ట్రస్థాయి నాయకత్వం గెలుపుకోసం సామాజికవర్గాల వారీగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుట్టబోయే బిడ్డపై లక్ష రూపాయలు అప్పు చేయబోతున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ఆమె ప్రచారం నిర్వహించారు. మహిళలకు పావలా వడ్డీ రుణాలు రావడం లేదని... పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. ఆడబిడ్డగా తనకో అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. గడిచిన ఎనిమిదేళ్లలో తెరాస, భాజపాలు మునుగోడులో ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదని స్రవంతి ధ్వజమెత్తారు. ఉపఎన్నికల్లో ఆడబిడ్డను గెలిపించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఓటర్లను అభ్యర్థించారు.