నాగార్జునసాగర్ ఉపఎన్నికలో.. తెరాస నాయకులు డబ్బు సంచులతో ఊళ్లలోకి వచ్చి కాంగ్రెస్ నాయకులను కొంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు మాత్రం తెరాస వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకొని కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా హాలియాలో శనివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగర్జన సభ నిర్వహించారు.
ప్రచారానికి దూరంగా ఉందాం.. సిద్ధమా కేసీఆర్?
సోనియాగాంధీ కేసీఆర్‌ను ఎన్నడూ నమ్మలేదని.. తనని నమ్మే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని జానారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో మండలాల వ్యవస్థకు ఆద్యుడిని తానేనని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ఆదర్శ రాజకీయాలను నెలకొల్పుదాం. ఏ పార్టీ ఇక్కడ ప్రచారం చేయకూడదు. కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని ప్రజలకు స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఇవ్వాలి. నేను గాంధీభవన్‌లో ఉంటా. ఈ సవాల్‌ను ముఖ్యమంత్రి స్వీకరిస్తే నేను సిద్ధమే’ అని జానారెడ్డి అన్నారు. నెల్లికల్ ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీకి బిడ్డ లాంటిదని, 2013లోనే ఈ పనిని ప్రారంభించాలని అనుకున్నా కేంద్ర అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో జాప్యం జరిగిందన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షి ప్రస్తుత శాసనమండలి ఛైర్మన్, అప్పటి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అని తెలిపారు.