ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికకు మరో వారం రోజులే మిగిలి ఉంది. రాష్ట్ర స్థాయి నేతలంతా నియోజకవర్గంలోనే తిష్టవేసి... తమ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నారు. అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను, జిల్లాల ముఖ్యనేతలను రంగంలోకి దించుతుండగా... ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపాలు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులను ప్రచారానికి తీసుకువస్తోంది. సిట్టింగ్ స్థానం, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్న తెరాస... సర్వశక్తులొడ్డుతూ సత్తాచాటేందుకు యత్నిస్తోంది.
కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి బరిలో ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకతతో తమ గెలుపు తథ్యమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. మరో ప్రధాన పార్టీ భాజపా.... ఇటీవల వరుస విజయాలతో ఇక్కడ కూడా తమ సత్తాచాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు, రాష్ట్రస్థాయి నేతలతో జోరుగా ప్రచారం సాగిస్తోంది.
జోరుగా ప్రచారం...
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం ఎర్ర చెరువు, నెల్లికల్, జాలు తండాల్లో... తెరాస అభ్యర్థి నోముల భగత్‌తో కలిసి మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి హయాంలో నియోజకవర్గానికి చేసిందేమి లేదని... తెరాస పాలనలోనే గ్రామాలు అభివృద్ధి పథంలో పయనించాయని తెలిపారు. తెరాస అభ్యర్థికి మరోసారి ప్రజలు పట్టం కట్టాలని మంత్రులు కోరారు. గుర్రంపోడు మండలం కొప్పోలు, మొసంగి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
పెనుమార్పులు...
జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గుర్రంపోడ్ మండలంలో జానారెడ్డికి మద్దతుగా పార్టీ నేతలతో కలిసి వారు ప్రచారం నిర్వహించారు. తెరాస నేతలు డబ్బు, మద్యంతో గెలుపొందాలని యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో జానారెడ్డి తమ సీఎం అభ్యర్థిగా ఒప్పిస్తామని తెలిపారు.