CMRF funds Fraud : పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్మును కొందరు అడ్డదారులు తొక్కి కాజేస్తున్నారు. ఆసుపత్రుల్లో నకిలీ బిల్లులు సృష్టించి.. వాటి ద్వారా వచ్చిన డబ్బును దోచుకుంటున్నారు. ఇలా ఏకంగా రూ.4.50 లక్షలు దోచుకున్నారు. ఈ విషయంపై సీఎం సహాయ నిధి కార్యాలయానికి చెందిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు మోసం బయటపడింది. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన నల్గొండ, మిర్యాలగూడలలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీఎం సహాయ నిధి సొమ్మును అడ్డదారులలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై సచివాలయంలోని రెవెన్యూ శాఖ అధికారి నెల క్రితం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైఫాబాద్ పోలీసులు సదరు కేసును సీసీఎస్కు బదిలీ చేసి.. పత్రాలను పరిశీలించారు. అందులో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రితో పాటు, మిర్యాలగూడలోనూ మరో ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు అక్రమంగా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు తేలింది.
వారు రూ. 4.50 లక్షల విలువ చేసే నకిలీ బిల్లులను రూపొందించినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై పలు సెక్షన్స్ కింద కేసును నమోదు చేశారు. అయితే మరికొంత మంది వ్యక్తులు ఈ తరహా మోసానికి పాల్పడి.. ఉండవచ్చని సీసీఎస్ అధికారులు అనుమానిస్తున్నారు.