ఉప ఎన్నిక సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీల అమలుపై సమీక్ష నిర్వహించేందుకు... ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హాలియాలో పర్యటించనున్నారు. ఉప ఎన్నికల సమయంలో రెండు సార్లు పర్యటించిన సీఎం... అభివృద్ధి పనులకు హామీ ఇచ్చారు. వాటిని నెరవేర్చే ప్రక్రియలో జిల్లా ఉన్నతాధికారులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో... ఈరోజు ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేసింది. ముందుగా అనుకున్నట్లు ఐటీఐ ప్రాంగణం కాకుండా... హాలియా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కార్యక్రమం జరగనుంది. ఉదయం పదింటికి హైదరాబాద్ నుంచి బయల్దేరే సీఎం... 11 గంటలకు సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించిన అనంతరం... నోముల భగత్ నివాసానికి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. గంట పాటు అక్కడ గడిపి తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు.
CM KCR TOUR: హామీల అమలుకై.. నేడు హాలియాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్ - నాగార్జునసాగర్
ముఖ్యమంత్రి కేసీఆర్.. నల్గొండ జిల్లా పర్యటన ఖరారైంది. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన హాలియాలో పర్యటించనున్న సీఎం... ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో బయల్దేరి 40 నిమిషాల్లో హాలియా చేరుకుంటారు. పోడు భూములు, నెల్లికల్ లిఫ్ట్, డిగ్రీ కళాశాలలు, గ్రామపంచాయతీకి నిధులు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే సమీక్షలో వివిధ అంశాలు చర్చకు రానున్నాయి. నెల్లికల్ లిఫ్టుతో పాటు పోడు భూముల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పోడు భూముల సమస్యను తీర్చేందుకు... సీఎం ఆదేశాల మేరకు రెండు నెలల క్రితమే అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. తిరుమలగిరి మండలంలోని 5 గ్రామాల్లో... గతంలో అధికంగా పట్టా పాసు పుస్తకాలు నమోదై ఉన్నాయి. ఉన్నది వంద ఎకరాలైతే 150 ఎకరాలకు పాసు పుస్తకాలుండటం వల్ల... వాటిని పట్టాదారులకు ఇవ్వకుండా వివాదాస్పదమైనవిగా పేర్కొంటూ పార్ట్-బీలో ఉంచేశారు. మొత్తంగా ఐదు గ్రామాల పరిధిలో అలాంటివి 3 వేల 4 వందల ఎకరాలు గుర్తించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న సదరు భూములపై స్పష్టత తీసుకురావాల్సి ఉంది.
కళాశాలలు, నిధులపై సమీక్ష...
నాగార్జునసాగర్, హాలియాల్లో డిగ్రీ కళాశాలలకు హామీ ఇచ్చినా... కేవలం హాలియాలోనే జూనియర్ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటైంది. నాగార్జునసాగర్ వద్ద కళాశాల ప్రారంభించాల్సి ఉంది. పురపాలికలు, మండలాలు, గ్రామ పంచాయతీలకు నిధులు ప్రకటించినా ఇంతవరకు మంజూరు కాలేదు. వీటితో పాటు మరిన్ని స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... సోమవారం రోజున హాలియాలో సమీక్ష చేపట్టనున్నారు.