తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్‌లో ఘన విజయం సాధించాల్సిందే: కేసీఆర్​ - KCR comments on Nagarjunasagar by-election

నాగార్జున సాగర్‌ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని తెరాస శ్రేణులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో పార్టీ ఇన్‌ఛార్జులతో సాగర్‌ ఉపఎన్నికపై.... సీఎం సమావేశం నిర్వహించారు.

CM KCR TALK ABOUT Nagarjunasagar by-election 2021
సాగర్‌లో ఘన విజయం సాధించాల్సిందే: కేసీఆర్​

By

Published : Mar 6, 2021, 7:02 AM IST

నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక తెరాసకు అత్యంత ప్రతిష్ఠాత్మకమని, అక్కడ ఉద్ధృతంగా ప్రచారం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. నియోజకవర్గంలోని రెండు పురపాలికలు, ఏడు మండలాలను మొత్తం తొమ్మిది యూనిట్లుగా చేసి ఎనిమిది చోట్ల ఎమ్మెల్యేలకు, మరో చోట కరీంనగర్‌ మేయరు, శాతవాహననగరాభివృద్ధి సంస్థ (సుడా) ఛైర్మన్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. సాగర్‌ ఉప ఎన్నికపై ఎర్రవల్లిలోని తమ నివాసంలో పార్టీ ఇన్‌ఛార్జులతో సీఎం సమావేశమయ్యారు. ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

సమన్వయంతో పనిచేయాలి..

ప్రతి గ్రామానికి 11 మంది చొప్పున నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని కేసీఆర్ అన్నారు. శనివారం నుంచే అంతా రంగంలోకి దిగాలన్నారు. సాగర్‌లో ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఘన విజయం సాధించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం పునరావృతం కారాదని చెప్పారు. ‘‘నాగార్జునసాగర్‌లో విజయం మనదే. ప్రతి ఓటరును కలవాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వపరంగా కలిగిన లబ్ధిని తెలియజేయాలి. ఏ చిన్న పొరపాటు జరగొద్దు. నియోజకవర్గంలో అంతా పూర్తి సమన్వయంతో పనిచేయాలి. తెరాస అభ్యర్థి అత్యధిక మెజారిటీని సాధించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

అభ్యర్థి ఎవరు!

ఒకట్రెండు రోజుల్లోనే సాగర్‌ ఉప ఎన్నికలకు తెరాస అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎం తెలిపారు. అభ్యర్థి ఎంపికపై చర్చించారు. సర్వే ఫలితాలను తెలిపారు. మెజారిటీ నేతలు యాదవ అభ్యర్థివైపు మొగ్గు చూపారు. గురవయ్యయాదవ్‌, రంజిత్‌యాదవ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరుల పేర్లపై చర్చించారని గురవయ్య యాదవ్‌ పేరును ఎక్కువ మంది ప్రస్తావించినట్లు సమాచారం. తుదివిడత సర్వే అనంతరం అభ్యర్థిని ఖరారు చేస్తామని సీఎం చెప్పారు. నాగార్జునసాగర్‌లో గతంలో కంటే అధికంగా సభ్యత్వ నమోదు చేయడంపై ఈ సందర్భంగా పార్టీ నేతలను కేసీఆర్‌ అభినందించారు. ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ప్రతి ఒక్కరూ పార్టీకే ఓటు వేసేలా కృషి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details