తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదో తేదీన నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హాలియాలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగిస్తారు. అంతకు ముందు ఉదయం 10 గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. 12.30 గంటలకు ఆయన నెల్లికల్లులో తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అటునుంచి హాలియాకు చేరుకుని సభలో పాల్గొంటారు.
అయిదు నియోజకవర్గాలు లబ్ధి పొందేలా
ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అయిదు నియోజకవర్గాల పరిధిలో... ఎత్తిపోతల పథకాలను ప్రారంభించనున్నారు. కేవలం నాగార్జునసాగర్కే పరిమితం కాకుండా... నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని అయిదు నియోజకవర్గాలు లబ్ధి పొందేలా ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. హుజూర్నగర్ పథకాలకు నిధులు మంజూరు చేస్తూ శుక్రవారమే ఆదేశాలు రాగా... దేవరకొండ, ఇతర నియోజకవర్గాలకు సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వచ్చే అవకాశముంది. సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, మునుగోడు నియోజకవర్గాలు లబ్ధి పొందేలా... లిఫ్టులు మంజూరయ్యాయి.
వీటితోపాటే పూర్తి చేయాలని
ఉప ఎన్నిక జరిగే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నెల్లికల్, కుంకుడుచెట్టు తండా లిఫ్టులను ఇప్పటికే ప్రకటించగా... హాలియా డిగ్రీ కళాశాలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దేవరకొండ పరిధిలోని అంబా భవాని, కంబాలపల్లి, పెద్దగట్టు, అంగడిపేట, పొగిళ్లతోపాటు... మిగతా ప్రాంతాల్లో ఎత్తిపోతల నిర్మాణాలు జరగనున్నాయి. ఇందుకోసం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక సందర్భంగా హామీ ఇచ్చిన ఎత్తిపోతల పథకాల్ని వీటితోపాటే పూర్తి చేయాలన్న భావనతో... ఆ నియోజకవర్గానికి రూ.1,217.71 కోట్ల నిధుల్ని మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. మొత్తంగా అన్ని పథకాలు పూర్తయితే ఉమ్మడి జిల్లాలో... 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.
చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు
సాగర్ టెయిల్ ఎండ్తోపాటు ఇప్పటివరకు నీటి వసతి లేని ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా... ఎత్తిపోతల పథకాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. ముక్త్యాల ఎత్తిపోతలకు రూ.817.50 కోట్లు మంజూరవగా... చింతలపాలెం మండలం వెల్లటూరు సమీపంలో కృష్ణానది వద్ద నిర్మించనున్నారు. పాలకవీడు మండలంలో చివరి ఆయకట్టుకు నీరిచ్చేందుకు జాన్ పహాడ్ ఎత్తిపోతలకు రూ.118.70 కోట్లు మంజూరవగా... గుండెబోయినగూడెం వద్ద ఎత్తిపోతల ఏర్పాటు చేసి జాన్ పహాడ్ బ్రాంచి కాలువకు నీరు సరఫరా చేస్తారు. ముక్త్యాల బ్రాంచి కాలువ ఆధునికీకరణకు రూ.184.60 కోట్లు... జాన్ పహాడ్ బ్రాంచి కాల్వ ఆధునికీకరణకు రూ.52.11 కోట్ల మంజూరుకి ఆదేశాలు వచ్చాయి.