పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస సాధించిన విజయాలు మరపురానివని, పార్టీ చరిత్రలో నిలిచిపోతాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మంత్రులు మొదలుకొని కార్యకర్తల వరకు అందరి సమష్టి కృషి వల్లే ఈ ఫలితాలు సాధించామని చెప్పారు. వరుసగా రెండోసారి పట్టభద్ర ఎన్నికల్లో గెలిచి పల్లా రికార్డు సృష్టించారని ప్రశంసించారు. సాగర్ ఉప ఎన్నిక ఇప్పుడు పార్టీ ముందున్న లక్ష్యమన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. త్వరలో వరంగల్, ఖమ్మం నగరపాలక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా ఆదివారం నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తనకు మరోసారి టికెట్ ఇచ్చి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లాను సీఎం శాలువాతో సత్కరించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘తెరాస శక్తి తిరుగులేనిది. ఇటీవల దుబ్బాక, జీహెచ్‌ఎంసీలతో కొంత ఏమరుపాటు వల్ల ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఇప్పుడు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడ్డారు. తామే అభ్యర్థులుగా భావించి పనిచేశారు. అభ్యర్థులపైనా పట్టభద్రులు, ఉద్యోగుల్లో సానుకూలత ఉండడం కలిసి వచ్చింది. ఈ రెండు ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభుత్వం, పార్టీకి ఉన్న ఆదరణను నిరూపించాయి. తెరాస వాస్తవ బలాన్ని తెలియజేశాయి. పల్లా సమర్థుడు. నాకు ఆత్మీయుడు. పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. రైతుబంధు బాధ్యతలనూ చక్కగా నిర్వర్తించారు. అందరి అభిమానంతో మంచి విజయం సాధించారు’’ అని పేర్కొన్నారు.