నాగార్జుసాగర్ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఎవరన్నది మరో రెండురోజుల్లో తేలనుంది. అన్ని కోణాల్లో ఆలోచించి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రెండు నెలలుగా నిర్వహించిన సర్వే నివేదికను కేసీఆర్ పరిశీలించారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత పార్టీ మరోసారి నమూనా సర్వేను చేయించగా... దాని ఫలితం సీఎం వద్దకు చేరింది. ఈ తరుణంలో అభ్యర్థి ఎంపిక సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కసరత్తు ముమ్మరం చేశారు. సాగర్ నియోజకవర్గంలో బీసీ నేతనే నిలబెట్టాలని పార్టీ సర్వేలు, పరిశీలకులు సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల అభిప్రాయాలనూ ఇప్పటికే తెలుసుకున్నట్లు సమాచారం. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్ పేరు అభ్యర్థిత్వానికి ప్రముఖంగా పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్, బాలరాజ్ యాదవ్ పేర్లు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తేరా చిన్నపరెడ్డి, కోటి రెడ్డిల పేర్లు సైతం పరిశీలించే వీలుంది.
తొలిరోజు ఐదు నామపత్రాలు దాఖలు