నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడులో 'పొలం బాట-పోరుబాట' కార్యక్రమానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ట్రాక్టర్ను స్వయంగా నడుపుకుంటూ తుంగపాడు రైతు ర్యాలీలో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన సమస్యలపై చర్చించారు. నాగార్జునసాగర్ సహా కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల పుణ్యం వల్లనే మనమందరం అన్నం తింటున్నామని భట్టి అన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా మద్దతు ధరతోపాటు, ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల సాయంతో.. రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసి
నేడు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో అన్నదాతలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర చట్టాల వల్ల గిట్టుబాటు ధర ఉండదని... రైతులు నష్టాలను తట్టుకుని నిలబడలేని పరిస్థితి వస్తుందన్నారు. రైతులు తమ భూములు అమ్ముకుని ఉన్న ఊర్లోనే కూలీలుగా మారే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఓకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. రైతులకు ఉపయోగపడే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి.. ఆర్థిక స్వావలంబనను నిర్వీర్యం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పడం, ఆ తర్వాత మోసం చేయడం కేసీఆర్ నైజం అన్నారు.