Yadadri Thermal Power Station : నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వెలుగులు పంచేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఉత్పత్తిని ప్రారంభించే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. 29 వేల 992 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కేంద్రం నిర్మాణ పనుల టెండర్‌ను భెల్ సంస్థ దక్కించుకుంది. ఇందులో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంతో మొత్తం 5 ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మొదటి ప్లాంటులో విద్యుదుత్పత్తిని 2023 సెప్టెంబరు కల్లా ప్రారంభిస్తామని జెన్‌కో వెల్లడించింది. అదే ఏడాది డిసెంబరుకల్లా రెండో ప్లాంటు, 2024 లో 3, 4 ప్లాంట్లలో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. విద్యుత్ కేంద్రం మొత్తం నిర్మాణంలో ఇప్పటికే 61.5 శాతం పనులు పూర్తయ్యాయి. ఒకటీ, రెండు ప్లాంట్లలో ఇంకా ఎక్కువ శాతం జరిగాయి.
రాష్ట్రం ఏర్పడిన తరవాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్ విద్యుత్ కేంద్రం ఇది. తొలుత కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో కొత్త ప్లాంటును రికార్డుస్థాయిలో 48 నెలల్లో నిర్మించి విద్యుదుత్పత్తిని జెన్‌కో ప్రారంభించింది. ఆ తరవాత భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద 1080 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో మరో ప్లాంటును భద్రాద్రి పేరుతో చేపట్టి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ వరుసలో మూడో ప్లాంటు యాదాద్రి పేరుతో దామెరచర్ల వద్ద చేపట్టింది.