నల్గొండ జిల్లాలో నూతనంగా ఏర్పాటైన చండూరు పురపాలికలో తొలుత అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులేవీ జరగలేదు. పాలకవర్గం లేకపోవటం వల్ల అధికారుల పాలనలోనే సాగింది. 2018లో రూ.10 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు జీవో విడుదలైనా నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి. కలెక్టర్ కేటాయించిన నిధులతో కొంత వరకు సామగ్రిని సమకూర్చారు. పాలకవర్గం కొలువుదీరిన తర్వాత 14వ ఆర్థిక సంఘం నిధులు, పట్టణ ప్రగతి పనులతో కొంత మార్పు చోటుచేసుకుంది. ఇప్పటికే పనులను గుర్తించిన అధికారులు వాటిని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ పెద్ద మొత్తంలో మురుగు కాల్వల నిర్మాణం చేపడితే కానీ ప్రధానంగా ఉన్న పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కాదు. కానీ 14వ ఆర్థిక సంఘం నిధులతోనే అన్ని అభివృద్ధి పనులు చేయటం సాధ్యం కాదని, పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఆదర్శ పురపాలికగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
రూ.10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయటంతో ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు రేకెత్తాయి. వార్డుకు రూ.కోటి చొప్పున కేటాయిస్తారని అంతా అనుకున్నారు. కానీ నిధులు రాలేదు. పనుల నిర్వహణను ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. మురుగు కాల్వల నిర్మాణం, బస్సు ప్రాంగణాలు, సీసీరోడ్లతోపాటు పలు అభివృద్ధి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అప్పటి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వేర్వేరుగా ప్రణాళికలు వేశారు. కానీ పనులు మాత్రం నేటి వరకు ప్రారంభం కాలేదు.
ఆర్థిక సంఘం నిధులతో..
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.63 కోట్లు మంజూరయ్యాయి. ఇటీవల కలెక్టర్ పనులకు ఆమోదం తెలిపారు. మూడు చోట్ల మినీ పార్కులు, ఓపెన్ జిమ్, పాత భవనాల కూల్చివేత, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, మురుగు కాల్వలు, దుకాణాల నిర్మాణం, అంగడిపేటలో, శిర్దేపల్లికి వెళ్లే మార్గాల్లో పెద్ద మొత్తంలో పట్టణ ప్రకృతి వనాల నిర్మాణం వంటి పనులను చేపట్టాలని నిర్ణయించారు.