పత్తి పంటను నమ్ముకున్న వేలాది మంది రైతులు గత నెలలో కురిసిన వర్షాలతో దిగుబడులు కోల్పోయి కుదేలయ్యారు. దాదాపు 70 వేల ఎకరాలకు పైగా నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రాగా ఈ ఏడాది ఐదారు క్వింటాళ్లు దక్కడమే గగనమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలో పదిన్నర లక్షల ఎకరాల్లో తెల్లబంగారాన్ని సాగు చేశారు. అయితే సకాలంలో సీసీఐ కేంద్రాలు తెరవకపోవడం వల్ల దళారులు రంగ ప్రవేశం చేశారు. మూడున్నర వేల నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తూ రైతుల పొట్టగొట్టారు. మిగిలిన పంటైనా సీసీఐ కేంద్రాల్లో విక్రయించేందుకు రైతులు సిద్ధమయ్యారు. సీసీఐ గతేడాది క్వింటాకు రూ.5,550 చెల్లించగా ఈసారి రూ.5,825 చెల్లించనుంది.
దీపావళి తర్వాత అన్ని చోట్ల కొనుగోళ్లు
ఎనిమిది శాతం తేమతో కూడిన తెల్లబంగారానికి మాత్రమే రూ.5,825 చెల్లిస్తారు. అయితే 9 నుంచి 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయనుండగా... అంతకు పైస్థాయిలో ఉంటే తిరస్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. దీపావళి తర్వాత అన్ని చోట్ల కొనుగోళ్లు మొదలవుతాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 40 మిల్లులు ఉండగా... మంగళవారం వరకు 16 మిల్లుల పరిధిలో కొనుగోళ్లు జరిగాయి. గత మూడు రోజుల్లో నల్గొండ జిల్లాలో 2 వేల మంది రైతుల వద్ద 70 వేల క్వింటాళ్లు... యాదాద్రి జిల్లాలో 325 మంది రైతుల నుంచి 5,129 క్వింటాళ్లు కొన్నారు.