తెలంగాణ

telangana

ETV Bharat / state

మునుగోడులో హామీల వర్షం కురిపిస్తున్న పార్టీలు.. తడిసిముద్దవుతోన్న ఓటర్లు - తెలంగాణ తాజా వార్తలు

Munugode Bypoll Campaign: పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. నేతల పరస్పర విమర్శలు..హోరెత్తించే కార్యకర్తల నినాదాలతో మునుగోడు రాజకీయ వాతారణం వేడెక్కింది. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సాధారణ కార్యకర్త నుంచి అగ్రనేత వరకు వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఆశీర్వదించాలని అభ్యర్థిస్తుండగా.. నియోజకవర్గమంతా రోడ్‌షోలు, ర్యాలీలతో ప్రచార జోరు కనిపిస్తుంది. హామీల వర్షం.. నేతల సుడిగాలి పర్యటనలు.. విమర్శల వాయుగుండాలు ఇది ప్రస్తుత మునుగోడు పరిస్థితి.

Munugodu by election campaign
Munugodu by election campaign

By

Published : Oct 17, 2022, 8:30 PM IST

హామీల వర్షంతో తడిసిముద్దవుతున్న మునుగోడు.. గేలుపు ఎవరికి వారే ధీమా

Munugode Bypoll Campaign: రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా.. నేతలంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. గడపగడపకు వెళ్లి మద్దతివ్వాలంటూ ఓటర్లను కోరుతున్నారు. తెరాస, కాంగ్రెస్, భాజపా నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మకాం వేసి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెరాస అభ్యర్థికి మద్దతుగా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రచారం నిర్వహించారు. స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన.. పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

మునుగోడులో తెరాస విజయం ఖాయమైందని.. తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాస సర్కార్ అభివృద్ధి పథకాలను వివరిస్తూ మునుగోడు, చండూరు మండలాల్లో జోరుగా ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటమి భయంతోనే రాజగోపాల్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కూసుకుంట్ల మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్​ భాజపాకు భయపడే గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవో ఇచ్చారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నామనాయక్ తండాలో ఉపఎన్నిక ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారని ఈటల స్పష్టం చేశారు. తాను ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తానని ఆ తర్వాత నెలరోజుల్లోనే తెరాస ప్రభుత్వం పడిపోవటం ఖాయమని భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి జోస్యం చెప్పారు. రాబోయేది భాజపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. చండూరు మండలం కొట్టాలలో రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొత్తానికి పార్టీల హామీల వర్షంలో మునుగోడు ఓటర్లు తడిసిముద్దవుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details