నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పినా.. చివరి నిమిషంలో ప్రారంభం వాయిదా వేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రారంభోత్సవం లేకున్నా.. కేటీఆర్ సహా మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీహెచ్ మల్లారెడ్డిలు పార్కును పరిశీలించనున్నారు. జరుగుతున్న పనుల గురించి ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యను అడిగి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం లేకున్నా.. సందర్శకులను బుద్ధవనంలోకి అనుమతించే విషయమై నేడు మంత్రుల బృందం తుది నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
ఈ సందర్భంగానే నందికొండ, హాలియా పురపాలికల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పెద్దవూర మండలం సుంకిశాల వద్ద హైదరాబాద్ తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేస్తున్న ఇన్‌టేక్ వెల్ పంపింగ్ స్టేషన్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం హాలియాలో బహిరంగ సభలో పాల్గొననున్నారు.
రెండేళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉన్నా..:ఈ బుద్ధవనం ప్రాజెక్టును రెండేళ్ల క్రితమే ప్రారంభించాల్సి ఉన్నా.. కరోనాతో పాటు వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. చివరగా నేడు మంత్రి కేటీఆర్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభిస్తారనుకున్నా.. చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడింది. కృష్ణా నది ఒడ్డున ప్రసిద్ధ బౌద్ధ క్షేత్ర పర్వత ఆరామమైన నందికొండలో ‘బుద్ధవనం’ప్రాజెక్టును 274 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని 2003లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీలంక నుంచి తెచ్చిన 27 అడుగుల ప్రతిమ అందరినీ ఆకర్షిస్తుంది. దేశంలోని బుద్ధగయ, సార్‌నాథ్, లుంబిని తదితర ప్రాంతాల్లో లేని విధంగా అన్ని ప్రతిమలను ఈ పార్కులో నెలకొల్పడం విశేషంగా నిలుస్తోంది.