తెరాస హయాంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ అసమర్థ పాలనతో ప్రైవేట్ టీచర్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తేనే తెరాసకు ప్రజలు గుర్తుకు వస్తారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా గుర్రంపోడులో ఆయన పర్యటించారు.
ఏడేళ్లలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: బండి సంజయ్ - కేసీఆర్ పై బండి సంజయ్ విమర్శలు
ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి తెరాస నేతలు పబ్బం గడుపుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా గుర్రంపోడులో రోడ్ షోలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆరోపించారు.
మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టడంతోనే ముఖ్యమంత్రి కాలం గడుపుతున్నారని ఆరోపించారు. ఏడేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారిస్తూ... అక్రమ చర్యలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు ప్రతి పైసను కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందన్నారు. గుర్రంపోడు మండలంలోని కొప్పోలు, ఒద్దిరెడ్డిగూడెం గ్రామాల్లో పర్యటించారు. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయితోనే... రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని బండి సంజయ్ ప్రజలకు వివరించారు.
ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎన్నికలప్పడు గంపెడు హామీలిస్తారు. వాటిని మరిచిపోతారు. మన డబ్బులే పంచుతూ ఓట్లు అడుగుతున్నారు. తెరాస నాయకులు ఇచ్చే పైసలు తీసుకోండి. ఓటు మాత్రం కమలం గుర్తుకు ఓటేయండి. ఒక్కసారి భాజపాను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తాం. కేంద్రం ఇచ్చే ప్రతి రూపాయితోనే... రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు