తెరాస, కాంగ్రెస్ పూర్తి స్థాయి కేడర్‌ను రంగంలోకి దింపాయి. భాజపా నుంచి ఇంకా సందడే మొదలు కాలేదు. ఇదీ... నిన్నమొన్నటి వరకు నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో వినిపించిన మాట. ప్రచారం చివరి అంకానికి వస్తున్న తరుణంలో... కమలం పార్టీ విస్తృతంగా పర్యటనలు చేపడుతోంది. సీనియర్ నేతల్ని రప్పించి... ఓట్లు పడేలా వ్యూహాలు సిద్ధం చేసింది. నేటి నుంచి బండి సంజయ్... మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. సోమ, మంగళ, గురువారాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు... అన్ని మండలాలు చుట్టి వచ్చేలా ప్రణాళిక తయారు చేశారు. అభ్యర్థి రవినాయక్‌ను గెలిపించుకునేందుకు... శతథా యత్నిస్తున్నారు.
ముఖ్య నేతల ప్రచారం...
కమలం పార్టీ తరఫున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి... శని, ఆదివారాల్లో విస్తృతంగా రోడ్ షోల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోనే ఉండి... శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ... రెండ్రోజుల పాటు ఓటర్లతో మమేకమై భాజపాను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సినీనటుడు బాబూమోహన్ సైతం ప్రచారంలో పాల్గొన్నారు. హాలియాలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ సమావేశం నిర్వహించి... రోడ్ షోకు హాజరయ్యారు. తెరాస తీరును నేతలు తీవ్రంగా ఎండగడుతూ... ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.