తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​ పోరు: భాజపా సరికొత్త పంథా.. విపక్షాలకు భిన్నంగా ప్రచారం - nagarjuna sagar by elections 2021

పట్టభద్రుల ఎన్నికల ఫలితాల్లో గట్టి ఎదురుదెబ్బ తగలడంతో తన పంథాను మార్చుకుంది భాజపా. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం కోల్పోవడంతో కమలనాథులు నూతన ప్రచార వ్యూహాన్ని అవలంభిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ వ్యూహాన్ని బహిరంగ పర్చి నాలుక కర్చుకున్న కమలదళం... సాగర్ ఉపఎన్నికల్లో జాగ్రత్తపడుతోంది. హంగు, ఆర్భాటాలు చేయకుండా నిశ్శబ్దవ్యూహాంతో ప్రచారపర్వాన్ని సాగిస్తోంది. ప్రచార గడువు ముగిసే వారం రోజుల ముందు నుంచి హోరెత్తించాలని నిర్ణయించుకుంది.

bjp new strategy, bjp new strategy
సాగర్​ పోరు: భాజపా సరికొత్త పంథా.. విపక్షాలకు భిన్నంగా ప్రచారం

By

Published : Apr 10, 2021, 7:25 PM IST

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా మంచి ఫలితాలు సాధించింది. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచే కొత్త ఎత్తుగడలను తెరమీదకు తీసుకువస్తూ... ప్రత్యర్థి పార్టీలకు నిద్రపట్టకుండా చేసింది. రాష్ట్ర కమల దళపతి బండి సంజయ్‌ సరికొత్త పంథాతో ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసి అద్భుతమైన ఫలితాలు సాధించడంలో సఫలీకృతమయ్యారు. అదే తరహా వ్యూహాలను పట్టభద్రుల ఎన్నికల్లో అవలంభించినప్పటికీ.. పూర్తిగా వైఫల్యం చెంది.. ఉన్న సిట్టింగ్‌ స్థానాన్ని సైతం చేజార్చుకుంది. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ విజయాలతో జోరు మీదున్న కమలనాథులకు ఈ ఫలితాలు కంగుతినిపించాయి. దీంతో భాజపా రాష్ట్ర నాయకత్వం పునరాలోచనలో పడింది. దీంతో వ్యూహాలను బహిర్గత పర్చకుండా అధికార, విపక్షాలకు భిన్నంగా ప్రచారహోరు సాగిస్తోంది.

పంథా మార్చి.. ముందుకు

నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల షెడ్యూల్​కు ముందే 30 మందితో స్టార్​ క్యాంపెయినర్​ల జాబితాను ప్రకటించినప్పటికీ.. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు నిరాశజనకంగా రావడంతో ముందు నుంచే దూకుడుగా వెళ్లొద్దని నిర్ణయించుకుంది. ముందు నుంచే ప్రచారాన్ని హోరెత్తిస్తే తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు భాజపా అనుకూల ఓట్లను దెబ్బతీసే ప్రమాదం ఉందని క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగతూ.. ఓట్లు అడగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముఖ్య కార్యకర్తలను నాగార్జున సాగర్‌లో దింపింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి నాగార్జున సాగర్‌కు వెళ్లకుండా హైదరాబాద్‌ కేంద్రంగా పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉపఎన్నిక ప్రచారానికి వారం రోజుల ముందు నుంచి ప్రచారపర్వాన్ని హోరెత్తించాలని భాజపా నిర్ణయించుకుంది. ఈ నెల 8 నుంచి పూర్తిస్థాయిలో తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఇవాళ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రచారంలో పాల్గొన్నారు.

టార్గెట్​ 2023 ఎన్నికలు

ఈ వారం రోజులు 30 మంది స్టార్‌ క్యాంపెయినర్లందరూ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ప్రతి బూత్ స్థాయిలో సభలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. తెరాస ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని నిర్ణయించారు. జనరల్‌ స్థానంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్‌ కేటాయించడం వల్ల ఈ నియోజకవర్గంలోని ఎస్టీ ఓట్లతో పాటు గుర్రంపోడు వివాదం కలిసి వస్తోందని భాజపా భావిస్తోంది. భవిష్యత్‌లోనూ ఎస్టీ సామాజిక వర్గాన్ని భాజపా వైపు ఉండేలా టికెట్‌ కేటాయించారు. ఈ ఎన్నికల్లో భాజపా గెలిచేలా సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తే కనీసం రెండో స్థానంలోనైనా నిలుస్తామని యోచిస్తోంది. గతంలో డిపాజిట్‌ కూడా దక్కని చోట ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య రెండోస్థానంలో భాజపా నిలిస్తే.. 2023 ఎన్నికల్లో భాజపా విజయానికి దోహాదం చేస్తోందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

స్టార్​ క్యాంపెయినర్లతో ప్రచారం

భాజపా ఉప ఎన్నికల ప్రచారంలో స్టార్‌ క్యాంపెయినర్లు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, లక్ష్మణ్‌, డీకే అరుణ, మురళీధర్‌ రావు, ధర్మపురి అర్వింద్‌, రాజాసింగ్‌, రఘునందన్‌ రావు, రాంచందర్‌ రావు, నల్లు ఇంద్రాసేనారెడ్డి, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, జితేందర్‌ రెడ్డి, గరికపాటి మోహాన్‌రావు, విజయశాంతి, చాడ సురేష్‌ రెడ్డి, బాబుమోహాన్‌, స్వామిగౌడ్‌ పాల్గొననున్నారు.

ABOUT THE AUTHOR

...view details