BJP Munugode By Election Campaign Strategy: సాధారణ ఎన్నికలకు ముందు జరిగే మునుగోడు ఉపఎన్నికను కాషాయ దళం సెమీ ఫైనల్‌గా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని అంచనావేస్తున్న భాజపా.. ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాదికి తెలంగాణను గేట్ వేగా భావిస్తున్న జాతీయ నాయకత్వం ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. జాతీయ నేతలతో పాటు కేంద్రమంత్రులను ప్రచార బరిలోకి దింపుతోంది.
కుల సంఘాల ఓట్లపై దృష్టి సారించిన భాజపా ఇప్పటికే కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను రంగంలోకి దింపింది. చౌటుప్పల్‌లో యాదవ సంఘాల నేతలతో సమావేశమమైన ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, దళితబంధు వంటి పథకాలపై ప్రశ్నించారు. తెరాస అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని సంఘం నేతలకు వివరించారు.
యాదవ సంఘం నేతలను చైతన్యపరిచినట్లే అక్కడున్న ఓటర్లను ప్రభావితం చేసే నాయకులతో పాటు కుల ప్రాతిపదికన నేతలను తీసుకెళ్లి ప్రచారాన్ని వేగవంతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మహిళా మోర్చా నేతలు సైతం గురువారం నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో భాజపాకు రాష్ట్ర కురుమ సంఘం మద్దతు ప్రకటించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కురుమ సామాజికవర్గానికి అన్యాయం చేశారని సంఘం నాయకులు హైదరాబాద్‌లో ఆరోపించారు. తమకు ఎలాంటి నామిటెడ్ పదవులు ఇవ్వకుండా.. కేవలం తమ సామాజికవర్గానికి చెందిన ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన స్వార్థం కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత గొర్రెల పంపిణీ మునుగోడు వారికే కేటాయించడం దారుణమన్నారు.