BJP MP Laxman fire on TRS: తెరాస నాయకులు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి కట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని.. బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం అంటే తెరాస పతనానికి నాంది అని మండిపడ్డారు. అనేక హామీలు ఇచ్చి విస్మరించిన మునుగోడు ప్రజలు తెరాసకు సమాధి కడతారని ఆరోపించారు.
కేసీఆర్ అవినీతి దేశం మొత్తం చూస్తోందని పేర్కొన్న ఆయన.. ఉద్యమ నాయకులు అందరూ తెరాస నుంచి బయటకు వస్తున్నారని అన్నారు. ఇప్పుడు తెరాసలో ఉన్నది ఉద్యమ ద్రోహులే అని ఆయన విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ఉద్యమ కారులకు, ఉద్యమ ద్రోహులకు మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. తెలంగాణ అభివృద్ధి మోదీతోనే సాధ్యమని.. ఉద్యమకారులంతా భాజపాలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు.
మునుగోడు ఉపఎన్నికలో భాజపా గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్, కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రాజకీయంగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఇప్పటికి నియామకాలు చేపట్టడం లేదని.. సక్రమంగా పరీక్షలు నిర్వహించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్కు ఉద్యోగ ప్రకటనలు గుర్తుకు వస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
"కేసీఆర్, తెరాస నాయకులు దిగజారుడు రాజకీయాలకు ఇంత కన్నా స్కోప్ లేదు అనుకున్నా.. కాని నా అంచనా తప్పు అని తెలుస్తోంది. మునుగోడులో జేపీ నడ్డాకు సమాధి కట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం అంటే తెరాస పతనానికి నాంది. కేసీఆర్ చెబుతుంటారు నేను 80వేలు పుస్తకాలు చదివా అని .. మరి ఏం చెప్పావు మీ పార్టీ నాయకులకు.. బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం వారి పతనానికి నాంది".- లక్ష్మణ్, భాజపా ఎంపీ
బతికి ఉన్న వ్యక్తికి సమాధి కట్టడం అంటే తెరాస పతనానికి నాంది: ఎంపీ లక్ష్మణ్ ఇవీ చదవండి: