BJP Leaders reacts on Munugode result: మునుగోడులో తెరాస విజయం సాధించడంపై భాజపా నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయినా అక్కడ తమ పార్టీ నైతికంగా విజయం సాధించిందని వారు పేర్కొన్నారు. చావుతప్పి కన్నులొట్టపోయినట్లు వామపక్షాల భిక్షతో తెరాస విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. డబ్బుతో ప్రలోభ పెట్టామని తెరాస తమపై దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి నైతికంగా విజయం సాధించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కంచుకోటలో భాజపా సత్తా చాటిందని ఆయన పేర్కొన్నారు. వామపక్షాల భిక్షతో తెరాస గెలిచిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తెలియగానే... సూది, దబ్బడం పార్టీ నేతలను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారని దుయ్యబట్టారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం కేసీఆర్‌కు అలవాటని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 33 గిరిజన తండల్లో ఉన్న 13వేల ఓట్ల కోసం గిరిజన రిజర్వేషన్ ప్రకటించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎల్బీనగర్‌లో స్థలాలు రెగ్యులరైజ్ చేశారని ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. పోలీసులు ఉప ఎన్నికలో చట్టానికి లోబడి పనిచేయలేదని మండిపడ్డారు.
'కేటీఆర్ గారి మాటలు వింటుంటే... దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ఎంతో కసితో, దుర్మార్గంతో మాపై దాడులు చేశారు. డబ్బుతో ప్రలోభ పెట్టామని తెరాస మాపై దుష్ప్రచారం చేసింది. కాంగ్రెస్ కంచుకోటలో భాజపా సత్తా చాటింది. మునుగోడు ప్రజలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా. హుజురాబాద్‌లో నన్ను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారు. 35 వేల గొల్ల కురుమల ఓట్ల కోసం ఖాతాల్లో డబ్బులు వేశారు.'-ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే